ద్వీప దేశ అధ్యక్షుడు రణిల్‌తో ద్వైపాక్షిక చర్చలు
*న్యూఢిల్లీ : భారత్ – శ్రీలంక పెట్రోలియం పైప్‌లైను ఏర్పాటుకు, అలాగే ఇరు
దేశాలు మరింత అనుసంధానం అయ్యేలా భూమార్గ వంతెన నిర్మాణానికి సాధ్యాసాధ్యాల
అధ్యయనం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. మత్స్యకారుల
సమస్యలపై మానవతాదృక్పథంతో వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. తమిళ సమాజం
కోరుకొంటున్న గౌరవపద్రమైన జీవితాన్ని శ్రీలంక ప్రభుత్వం అందిస్తుందన్న ఆశాభావం
వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన తమిళులు శ్రీలంకలో అడుగుపెట్టి 200 ఏళ్లు
పూర్తయిన సందర్భంగా వారి కోసం రూ.75 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ
ప్రకటించారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా దిల్లీకి చేరుకున్న శ్రీలంక
అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర
మోదీలతో భేటీ అయ్యారు. మోదీతో ఆర్థిక, వాణిజ్య అంశాలపై విస్తృతంగా చర్చలు
జరిపారు. రాష్ట్రపతి భవన్లో విక్రమసింఘేకు స్వాగతం పలికిన ద్రౌపదీ ముర్ము
భారత్ అనుసరిస్తున్న పొరుగు దేశాల ప్రాధాన్య విధానంలో శ్రీలంకకు
ప్రత్యేకస్థానం ఉంటుందని తెలిపారు. మరోవైపు భారత్, శ్రీలంక దేశాలు తమ మధ్య
ఆర్థిక, వాణిజ్యపరమైన భాగస్వామ్యాన్ని, పరస్పర సహకారాన్ని
పెంపొందించుకునేందుకు ఒక దార్శనిక పత్రాన్ని ఆమోదించాయి. పర్యాటకం,
విద్యుత్తు, వాణిజ్యం, ఉన్నతవిద్య, నైపుణ్యాభివృద్ధి, ఇరు దేశాల అనుసంధానత
రంగాల్లో పరస్పర సహకారాన్ని వేగవంతం చేయడమే ఈ విజన్ లక్ష్యం. శ్రీలంక
అధ్యక్షుడితో చర్చలపై ప్రధాని మోదీ కార్యాలయం మీడియాకు ఓ ప్రకటన విడుదల
చేసింది. ‘‘గతేడాది శ్రీలంక ఆర్థికసంక్షోభంలో ఉన్నప్పుడు భారత్ స్నేహితుడిలా
అండగా నిలబడింది. శ్రీలంకలో యూపీఐ చెల్లింపుల విధానాన్ని ప్రారంభించేందుకు
భారత్‌తో కుదిరిన ఒప్పందం వల్ల ఇరు దేశాల మధ్య ఫిన్‌టెక్ (ఆర్థిక, సాంకేతిక)
అనుసంధానత ఉంటుంది. ఇరు దేశాలు భద్రతా ప్రయోజనాలు, అభివృద్ధి అంశాల్లో
ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని కలిసి
పనిచేయడం అవసరం. అందుకే ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు విజన్
డాక్యుమెంటును ఆమోదించాం’’ అని మోడీ అందులో తెలిపారు.
నాగపట్టణం నుంచి ప్రయాణికుల ఓడ : తమిళనాడులోని నాగపట్టణం, శ్రీలంకలోని
కంకేసంతురై నడుమ ప్రయాణికుల ఓడ నడపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత్
అభివృద్ధి పొరుగు దేశాలకు, హిందూ మహాసముద్ర ప్రాంతానికి లాభదాయకంగా ఉంటుందని
తాము విశ్వసిస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తెలిపారు.