హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా ప్రాజెక్టు నీటిని పంపిణీ
చేసేందుకు కృష్ణా బోర్డు ఇవాళ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రెండు తెలుగు
రాష్ట్రాలకు ఎంతమేరకు నీరు అవసరమో.. చర్చించి నీటిని పంపిణీ చేయనున్నారు.
మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అడుగంటుకుంది. ఈ క్రమంలో అక్కడ జలవిద్యుత్
ఉత్పత్తిని నిలిపివేయాలని కోరుతూ కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ రాసింది.
శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు వర్షాలు లేక వేసవి కంటే ముందే భానుడి ప్రభావం
అధికంగా ఉండడంతో అడుగంటుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని జల విద్యుత్
ఉత్పత్తి కేంద్రాల ద్వారా ప్రాజెక్టులోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఫలితంగా ప్రాజెక్టుకు దిగువన సాగునీటి, తాగునీటి అవసరాలకు రానున్న వేసవిలో
తీవ్ర ఇబ్బంది ఏర్పడనుంది. అయితే వెంటనే జల విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేలా
చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డును తెలంగాణ నీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్
లేఖలో కోరారు.
కృష్ణా జలాల్లో ఇప్పుటికే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని వినియోగించుకుందని ఆ
లేఖలో పేర్కొన్నారు. కేటాయింపుల ప్రకారం చూస్తే ఆంధ్రాకు 615.17 టీఎంసీలు,
తెలంగాణకు 316.90 టీఎంసీల వాటాను కలిగి ఉన్నాయని చెప్పారు. గత నెల 25వ తేదీకి
ఏపీ 542.45 టీఎంసీలు వినియోగించుకోగా ఇంకా 59.68 టీఎంసీలు ఇంకా వాడుకోవడానికి
ఉన్నాయన్నారు. అదే తెలంగాణ 183.05 టీఎంసీల నీటిని వినియోగించుకోగా ఇంకా 10.20
టీఎంసీల నీరు వాడుకోవడానికి ఉందన్నారు. అయితే తెలంగాణకు 123.63 టీఎంసీలు,
ఏపీకి 13.03 టీఎంసీలు కృష్ణా ప్రాజెక్టులో మిగులు ఉందని ఆలేఖలో తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల అవసరాలకు అనుగుణగా కృష్ణా నీటిని పంపిణీ చేసేందుకు
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో బోర్డు
సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్
మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ నారాయణరెడ్డి కమిటీలో
సభ్యులు పాల్గొననున్నారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని జలసౌధలోని బోర్డు
కార్యాలయంలో జరగనుంది.
అయితే గత ఏడాది డిసెంబరులో జరగాల్సిన బోర్డు సమావేశం అనేక కారణాల వల్ల వాయిదా
పడుతూ వస్తోంది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు కృష్ణా ప్రాజెక్టుల్లో నుంచి
ఎంత మేరకు నీరు అవసరమో అన్న అంశాన్ని చర్చించి నీటి పంపిణీని ఖరారు
చేయనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పటివరకు 34 టీఎంసీలు నీరు అందుబాటులో
ఉండగా నీటిని తోడుకునే కనీస మట్టం స్థాయి 18 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు
అధికారులు అంచనా వేస్తున్నారు.అలాగే నాగార్జునసాగర్‌లో 90 టీఎంసీల నీరు నిల్వ
ఉన్నట్లు నీటి పారుదల అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నీటి ఏడాది మే 31
ముగిసే నాటికి తెలుగు రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని
అనుకుంటున్నారు. ఇప్పటికే వినియోగించిన వాటా పోను అందులో మిగిలిన నీటిని ఈ
రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు.