అన్ని సంస్థలూ హెచ్ఎస్ఎల్ వైపే
నౌకల మరమ్మతుల్లో సత్తా చాటుతున్న హిందూస్థాన్ షిప్ యార్డ్
వివిధ దేశాలకు చెందిన 35 షిప్స్ రిపేర్ విజయవంతం
పదేళ్ల తర్వాత హెచ్‌ఎస్‌ఎల్‌కు మరమ్మతుల బాధ్యతలప్పగించిన ఓఎన్జీసీ
తాజాగా 3 నౌకల పనులను అప్పగించేందుకు షిప్పింగ్ కార్పొరేషన్ ఆసక్తి
ఈ ఏడాది రూ.1000 కోట్ల రికార్డ్ టర్నోవర్ లక్ష్యంగా అడుగులు
రూ.620 కోట్లతో సింధుఘోష్ సబ్ మెరైన్ పనులను దక్కించుకున్న షిప్‌యార్డ్
విశాఖపట్నం : ప్రపంచ దేశాలకు చెందిన సంస్థలు హిందూస్థాన్ షిప్‌యార్డుతో
జతకడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం షిప్‌రిపేర్ హబ్‌గా అడుగులు వేస్తోంది.
అదానీ పోర్టుల నుంచి అమెరికాకు చెందిన నౌకల వరకూ.. రక్షణ దళాల నుంచి ఆయిల్
కార్పొరేషన్ల వరకూ.. అన్ని సంస్థలూ హెచ్ఎస్ఎల్ వైపే చూస్తున్నాయి.
నిర్లక్ష్యంగా పనులు చేస్తారన్న అపప్రద నుంచి నిర్ణీత సమయానికంటే ముందుగానే
మరమ్మతులు పూర్తి చేస్తారన్న స్థాయికి ఎదిగిన షిప్‌యార్డు.. ఈ ఏడాది రూ.1000
కోట్ల టర్నోవర్ లక్ష్యంగా దూసుకెళ్తోంది. తాజాగా రూ.620 కోట్లతో సింధుఘోష్
సబ్‌మెరైన్ పనులను దక్కించుకున్న హెచ్‌ఎస్‌ఎల్‌కు మరో 3 నౌకల పనులను
అప్పగించేందుకు షిప్పింగ్ కార్పొరేషన్ కూడా ఆసక్తి చూపిస్తోంది. ఎలాంటి
నౌకలు, సబ్మెరైన్ల మరమ్మతులైనా రికార్డు సమయంలో పూర్తి చేస్తూ ఆయా సంస్థలకు
అప్పగిస్తున్న హిందూస్థాన్ షిప్‌యార్డు దేశంలోనే అతి పెద్ద ప్రధాన నౌకా
నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ 200 నౌకలు తయారు చేసిన
షిప్‌యార్డు తాజాగా 2000 షిప్స్ మరమ్మతుల పనులను కూడా పూర్తి చేసింది. ఈ
ఏడాది ఏకంగా రూ.20 వేల కోట్ల పనులకు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేయనుంది.
ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్(ఎఫ్ఎస్ఎస్)ని భారత నౌకాదళం, కోస్ట్‌గార్డు
కోసం తయారు చేసేందుకు డిసెంబర్లో రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందం
కుదుర్చుకోనుంది.
ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల
తయారీకి సన్నద్ధమవుతోంది. సాంకేతిక సంస్కరణలు చేసుకుంటూ నౌకా నిర్మాణం,
మరమ్మతుల విషయంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. అందుకే దేశ
విదేశీ సంస్థలు షిప్‌యార్డుకు పనులు అప్పగించేందుకు ముందుకు వస్తున్నాయి.
ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
(ఎస్సీఐ), డ్రెడ్జింగ్ కార్పొరేషన్(డీసీఐ), ఫారెస్ట్ సర్వే ఆఫ్
ఇండియా(ఎఫ్ఎస్ఐ), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్
ఇంజినీరింగ్ అండ్ ట్రైనింగ్ (సిఫ్నెట్)తో పాటు అమెరికాకు చెందిన మెక్
డెర్మాట్, సింగపూర్‌కు చెందిన అబాన్ ఆఫ్‌షోర్, అదానీ పోర్టులు, సెజ్‌లు.. ఇలా
ప్రతి సంస్థా హెచ్‌ఎస్‌ఎల్‌కు పనులు అప్పగించేందుకు సుముఖత చూపుతుండటం విశేషం.
పదేళ్ల తర్వాత ఓఎన్జీసీ : సింధుకీర్తి సబ్‌మెరైన్ మరమ్మతుల సమయంలో
షిప్యార్డుపై పడిన నిర్లక్ష్యపు మరక దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. అదే
సమయంలో ఓ నౌకను మరమ్మతు కోసం ఇచ్చిన ఓఎన్జీసీ.. ఆ తర్వాత హెచ్ఎస్ఎల్ వైపు
చూడలేదు. దాదాపు పదేళ్ల తర్వాత షిప్‌యార్డుకు పనులు అప్పగించేందుకు ఓఎన్జీసీ
రావడం విశేషం. ఓఎన్జీసీకి చెందిన డ్రిల్ షిప్, షిప్పింగ్ కార్పొరేషన్‌కు
చెందిన సాగర్ భూషణ్ పనులు చేపడుతోంది. దీంతో పాటుగా ఓఎన్జీసీ ప్లాట్‌ఫామ్
మరమ్మతుల బాధ్యతను షిప్‌యార్డుకు అప్పగించింది. అదేవిధంగా మరో మూడు షిప్పింగ్
కార్పొరేషన్ నౌకల పనులు కూడా షిప్‌యార్డుకు దక్కనున్నాయి. దీనికి సంబంధించి
త్వరలోనే టెండర్లు ఖరారు కానున్నాయి. ఇలా గత మూడేళ్ల వ్యవధిలో 31 భారీ నౌకల
మరమ్మతులను పూర్తి చేసింది. తాజాగా రూ.620 కోట్లతో సింధుఘోష్ సబ్‌మెరైన్
పనులను కూడా హెచ్ఎస్ఎల్ దక్కించుకుంది.
25 ఎకరాల్లో విస్తరణ పనులు : షిప్‌యార్డుకు సమీపంలో ఉన్న 25 ఎకరాల్లో
విస్తరణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి పరిశ్రమల శాఖ
నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఇప్పటికే క్షేత్రస్థాయి పనులను
కూడా మొదలు పెట్టింది. ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ తయారీకి అవసరమయ్యేలా 300
మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో స్లిప్వేని 2024 ఆగస్టు నాటికి
పూర్తిచేయాలన్న లక్ష్యంతో నిర్మాణ పనులు ప్రారంభించింది. ఒకేసారి 3 నుంచి 4
నౌకలు తయారు చేసేలా మరో స్లిప్‌వే నిర్మాణానికి అడుగులు వేస్తోంది.
రూ.1000 కోట్ల టర్నోవర్ లక్ష్యం : హిందూస్థాన్ షిప్‌యార్డ్ సీఎండీ కమాండర్
హేమంత్ ఖత్రీ
దేశంలోని 14 షిప్‌యార్డులతో పోల్చి చూస్తే హెచ్ఎస్ఎల్ నాలుగో స్థానంలో
ఉంది. రానున్న రెండేళ్లలో కోల్‌కతా షిప్‌యార్డ్‌ను అధిగమించి మూడుకి
చేరుకోవాలనే టార్గెట్‌ను నిర్దేశించుకున్నాం. రాబోయే నాలుగేళ్లలో నంబర్
వన్‌గా నిలిచేందుకు అవసరమైన ప్రణాళికలు అమలు చేస్తున్నాం. ఎందుకంటే షిప్
బిల్డింగ్‌లో అనేక పురోగతి సాధించాం. షిప్‌యార్డు చరిత్రలో తొలిసారిగా గత
ఆర్థిక సంవత్సరంలో రూ.755 కోట్లు టర్నోవర్ సాధించాం. ఈ ఏడాది రూ.1000 కోట్లు
మార్కు చేరుకుంటాం. హైవాల్యూస్‌తో చేపట్టనున్న నేవీ నౌకల నిర్మాణాలతో
హెచ్ఎస్ఎల్ వార్షిక టర్నోవర్ కూడా గణనీయంగా పెరగనుంది. ఇదే ఊపుతో స్వదేశీ
పరిజ్ఞానాన్ని దేశీయ పరిశ్రమలను మరింతగా ప్రోత్సహించే దిశగా అడుగులు
వేస్తున్నాం. మరోవైపు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్‌ను తయారు చేసేందుకు
సన్నద్ధమవుతున్నాం. మూడేళ్లుగా దీనిపై కసరత్తు చేస్తున్నాం. రక్షణ మంత్రిత్వ
శాఖ దీనిపై ఇటీవలే చర్చించింది. త్వరలోనే అనుమతులు వస్తాయని భావిస్తున్నాం.
ఇది వస్తే విశాఖపట్నం బూమ్ ఒక్కసారిగా పెరుగుతుంది.