ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు
విజయవాడ : కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల రాకను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా స్వాగతిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. పొత్తులపై సీపీఐ, సీపీఎం, ఆప్‌లతో మాట్లాడుతున్నామని, కలిసొచ్చే పార్టీలతో ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. శుక్రవారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ, సీపీఎంతో వారం రోజుల్లోనే భేటీ అవుతామని, పొత్తులపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. షర్మిల అవసరం ఎక్కడుందో అక్కడ ఆమెకు అధిష్ఠానం బాధ్యతలు అప్పగిస్తుందని వివరించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు. సమాజంలో అందరికీ న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీనే. సంక్రాంతి తర్వాత పార్టీలో పెనుమార్పులు రాబోతున్నాయి. సిటింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. ఈ నెల 17న స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ రాష్ట్రానికి వస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను, అభ్యర్థుల కసరత్తు ప్రారంభిస్తారని రుద్రరాజు తెలిపారు.