అమరావతి : సంక్రాంతి తర్వాత పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌ఛార్జిల నాలుగో జాబితా ఉంటుందన్న ప్రచారం వైసీపీ నేతలను కలవరపెడుతోంది. ఇప్పటికే మూడు జాబితాలను ప్రకటించి 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన అధిష్ఠానం.. ఇంకా ఎంతమందికి మొండి చేయి చూపిస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. సీటు దక్కించుకున్నవారు సీఎం, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు చెబుతుండగా మరికొందరు తాడేపల్లికి క్యూ కడుతున్నారు. పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. చీరాల నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. వైసీపీ మాత్రం ఆయన్ను పర్చూరు ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో అప్పటినుంచి అసంతృప్తితో ఉన్నారు. తిరిగి చీరాల వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాడేపల్లికి వచ్చి పార్టీ పెద్దలను కలవడం చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం వైసీపీకి మద్దతిచ్చారు. దీంతో చీరాల ఇన్ఛార్జిగా ఆయన కుమారుడు వెంకటేశ్‌ను వైసీపీ ప్రకటించింది. ఇప్పుడు చీరాల కోసం ఆమంచి పట్టుబట్టడం వైసీపీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి సైతం రెండ్రోజులుగా సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సర్వే రిపోర్టులు గంగులకు అనుకూలంగా లేవని, ఈ స్థానంలో మార్పులు చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. బ్రిజేంద్ర స్థానంలో ఆయన తండ్రి గంగుల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు ముఖ్యనేతలను కలిసి తన సీటు విషయమై ఆరా తీశారు. తనకు అన్యాయం చేయవద్దని కోరుతూ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా : గుమ్మనూరు జయరాం
మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను పార్టీ అధిష్ఠానం కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించింది. అయితే, పార్టీ నిర్ణయాన్ని ఆయన మద్దతుదారులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శుక్రవారం ఆలూరులో జయరామ్ తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై ఎంపీగా పోటీ చేయాలన్న పార్టీ నిర్ణయంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆలూరు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. అవసరమైతే విజయవాడలో ధర్నా చేస్తామని తేల్చి చెప్పారు. దీనిపై స్పందించిన జయరాం కార్యకర్తల నిర్ణయాన్ని గౌరవిస్తానని ప్రకటించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఈలోగా ఏదైనా జరగొచ్చని పేర్కొన్నారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.