తణుకు ప్రథమ శ్రేణి గ్రంధాలయ భవన నిర్మాణానికి రూ.1.03 కోట్లు
గ్రంథాలయ భవన నిర్మాణ శంఖుస్థాపన సభలో మంత్రి కారుమూరి
తణుకు : సంక్షేమం, అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత నిచ్చారని రాష్ట్ర పౌరసరఫరాల, వినియోగదారులు శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు బ్యాంక్ కాలనీలో రూ.1.03 కోట్లు నిధులతో తణుకు ప్రథమ శ్రేణి గ్రంథాలయ భవన నిర్మాణానికి మంగళవారం మంత్రి కారుమూరి శంఖుస్థాపన చేసి పూజలు నిర్వహించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ ముఖ్యంగా తణుకులో శిథిలావస్థకు చేరిన గ్రంధాలయ భవన ప్రాంతంలో నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. గ్రంధాలయాలు విజ్ఞాన బాండాగారాలని చదువరులంతా సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఈ గ్రంథాలయంలో పూర్తిస్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
ఆధునిక వసతులతో గ్రంధాలయం : గ్రంధాలయంలో ఉండే పుస్తక సంపద ద్వారా విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చీర్ల పద్మశ్రీ అన్నారు. విజ్ఞానం అందించే గ్రంధాలయ భవనాల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించే ఉద్దేశ్యంతోనే శిధిలావస్థకు చేరిన భవనాన్ని తొలగింపచేసి నూతన భవన నిర్మాణానికి కృషిచేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ఆధునిక వసతులున్న భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి చదువరులకు మంచి వాతావరణాన్ని కలుగచేస్తామని చెప్పారు.
విద్యార్థి ఉన్నతికి గ్రంథాలయాలే తోడ్పాటు :
పుస్తక సంపద కొలువుతీరే గ్రంథాయాలు మంచి విజ్ఞానాన్ని అందిస్తాయని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. తణుకులాంటి ప్రాంతంలో గ్రంధాలయ ఆవశ్యకత ఎంతో ఉందని స్పష్టం చేశారు. నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1.03 కోట్లు నిధులు కేటాయించడం శుభసూచకమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, డీఈఈ నాగబాబు, ఏఈ సదాశివరావు, లైబ్రేరియన్ సుగుణకుమారి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు మంగెన సూర్య, జేసీఎస్ పట్టణ కన్వీనర్ యిండుగపల్లి బలరామకృష్ణ, వైద్యవిభాగం జిల్లా అధ్యక్షులు డాక్టర్ దాట్ల సుందరరామరాజు, 25వ వార్డు నాయకులు రేలంగి రాంబాబు, జిలాని, సురేష్ రెడ్డి, కలవపూడి బాబు, ఎ. శ్రీనివాస్, కాంట్రాక్టర్ బలగం సోమేశ్వరరావు, గుబ్బల సూర్యచంద్రరావు, పిల్లి సూరిబాబు, తాడిపర్తి వాసు పాల్గొన్నారు.