33 వ డివిజన్ 216 వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ సెంట్రల్ : అవినీతి, వివక్షకు తావులేని సంక్షేమాభివృద్ధి పాలనకు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరునామాగా నిలిచారని ప్లానింగ్ బోర్డు
ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 33 వ డివిజన్
216 వ వార్డు సచివాలయ పరిధిలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి
సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తొలుత దివంగత నేత
వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన అనంతరం పర్యటన
ప్రారంభించారు. పురుషోత్తం వారి వీధి, మంగళంపల్లి వారి వీధి, గిరి వీధులలో గడప
గడపకు వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా..? అని
అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులకు సంక్షేమ పథకాల బుక్ లెట్లను
అందజేశారు. సెంట్రల్లో సత్యనారాయణపురంతో ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం
కార్యక్రమం నియోజకవర్గ వ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతోందని మల్లాది విష్ణు
తెలిపారు. చంద్రబాబు హయాంలో డివిజన్ పూర్తిగా కళ తప్పిందని.. కార్పొరేటర్
నుంచి ముఖ్యమంత్రి వరకు అన్ని స్థాయిలలోనూ తెలుగుదేశం ప్రజాప్రతినిధులు
ఉన్నప్పటికీ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. అనంతరం
మీడియాతో మాట్లాడారు.
గత పాలకులు సిగ్గుపడాలి
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డివిజన్
సర్వతోముఖాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు.
ప్రజావసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వాటిని తీర్చడమే ధ్యేయంగా
ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. 14 వ ఆర్థిక సంఘం నిధులు రూ.
80 లక్షలతో జిల్లా వారి వీధి, తాడంకివారి వీధి, పాపరాజు వారి వీధి, ఓగిరాల
వారి వీధి, తిరుమలశెట్టి వారి వీధి, కొమ్ము వారి వీధి, కనకరాజు వీధులలో నూతన
రోడ్లను నిర్మించినట్లు వెల్లడించారు. వీఎంసీ సాధారణ నిధులు రూ. 16.20 లక్షలతో
కావూరి వారి వీధి, మైలవరపు జమీందార్ వీధులలో పాత రోడ్లకు మోక్షం కలిగిందని
పేర్కొన్నారు. అలాగే గడప గడపకు మన కార్యక్రమం ద్వారా విడుదలైన రూ. 80 లక్షల
నిధులతో వందనపు వారి వీధి, ముదిగొండ వారి వీధి, తిరుమల రాజు వీధి, దాక్షిణ్యం
వారి వీధి, రామమందిరం వీధులలో నూతన రహదారుల నిర్మాణానికి టెండర్లను
ఆహ్వానించగా.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. రూ. 80 లక్షల
నిధులతో చేపట్టిన యూజీడీ సంపు.. వచ్చే నెల మొదటి వారానికి పూర్తిగా
వినియోగంలోకి వస్తుందని మల్లాది విష్ణు తెలిపారు. దీని ద్వారా ఈ ప్రాంత ముంపు
సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్య, వైద్య రంగాలకు పెద్దపీట
పేదరిక నిర్మూలనే ధ్యేయంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య
రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఇందులో
భాగంగా రూ. 2.56 కోట్ల నిధులతో ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన నాడు-నేడు పనులు
శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం
అందించడంలో భాగంగా ప్రారంభించుకున్న అయోధ్యనగర్ అర్బన్ హెల్త్ సెంటర్..
రోగులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తోందని చెప్పారు. ఈ వైద్య కేంద్రంలో 24
రకాల వైద్య పరీక్షలు, 172 రకాల మందులు అందుబాటులో ఉన్నాయని.. కనుక పరిసర
ప్రాంతాల ప్రజలు ఈ సేవలను సద్వినియోగపరచుకోవాలని సూచించారు. అలాగే 90 ఏళ్ల ఘన
చరిత్ర కలిగిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి ఈ
ప్రభుత్వంలోనే రూ. 70 లక్షల కామన్ గుడ్ ఫండ్ నిధులు విడుదలైనట్లు మల్లాది
విష్ణు గుర్తుచేశారు. మరోవైపు విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఏ ఒక్క హామీని అమలు
చేయని బీజేపీ పెద్దలు.. రాష్ట్ర ప్రభుత్వం గూర్చి నిర్లజ్జగా
మాట్లాడుతున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల
ఆకాంక్షాలను కేంద్రంలోని బీజేపీ నేతలు ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవని
నిప్పులు చెరిగారు. ముఖ్యంగా కర్ణాటక ఓటమితో జేపీ నడ్డా, అమిత్ షాల
మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో బీజేపీ
ఆటలు సాగవని.. బీజేపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి
లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఎంఓహెచ్
రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, డివిజన్ కోఆర్డినేటర్ దోనేపూడి శ్రీనివాస్,
నాయకులు లంకా బాబు, చల్లా సుధాకర్, కొల్లూరు రామకృష్ణ, ఉప్పు రంగబాబు, మైలవరపు
రామకృష్ణ, సనత్, చాంద్ శర్మ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.