రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర
పార్వతీపురం : సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం పాంచాలి గ్రామ సచివాలయం
పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరూ పింఛను పొందుతూ సంతోషంగా ఉన్నారు. అర్హులైన
అందరూ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి అనేది ప్రభుత్వ లక్ష్యమని
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 113 వరోజు పాంచాలి సచివాలయం పరిధిలో
శుక్ర వారం నిర్వహించారు. గ్రామస్తులు మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో ఉప
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో గడప గడపకు వెళ్ళి రాష్ట్ర
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను
వివరించారు. పాంచాలి సచివాలయం పరిధిలో 1,397 ఇల్లులు ఉండగా 1367 ఇళ్లకు
ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించిందని చెప్పారు. 98 శాతం ఇళ్ళు లందిపొందాయని
ఆయన పేర్కొన్నారు. 30 ఇళ్ళలో ఉద్యోగులు ఉండటం, ఎక్కువ భూములు కలిగి ఉండడం వలన
సంక్షేమ పథకాలకు అర్హులు కాలేకపోయారని చెప్పారు. 1397 ఇళ్లకు చెందిన
లబ్ధిదారులు దాదాపు10,173 మంది ఉండడం సంతోషదాయకమని, లబ్దిదారులకు 15 కోట్ల
3లక్షల రూపాయలు అందించడం జరిగిందని వివరించారు. గతములో ఎప్పుడూ ఇంతటి ఆర్థిక
సహాయం అందలేదని ఆయన చెప్పారు. 2006 సంవత్సరం నాటికి పాంచాలి లో పెన్షన్లు
100లోపు ఉండేవని వాటిని వెయ్యి వరకు మంజూరు చేసామని ఆయన పేర్కొన్నారు. జగనన్న
పాలనలో పాంచాలి సచివాలయంలో 2,321 పింఛన్లు మంజూరై 3సంవత్సరాలలో 5 కోట్ల 43
లక్షల 46 వేల 60 రూపాయిలు అందించడం జరిగిందని ఆయన అన్నారు. రైతు భరోసా పథకం
క్రింద 1891 మందికి 2 కోట్ల 34 లక్షల 76 వేల 700 వందల రూపాయలు పంపిణీ చేయగా,
అమ్మఒడి పథకం క్రింద 1,393 మంది తల్లులకు 1 కోటి 93 లక్షల 58 వేల రూపాయిలు
అందించడం జరిగిందని వివరించారు. వై.ఎస్.ఆర్ ఆసరా పథకం క్రింద 1,742 మంది అక్కా
చెల్లమ్మలకు 66 లక్షల 86 వేల 195 రూపాయిలు ఇంత వరకు ఆర్థిక సహాయం జరిగిందని
అన్నారు. వై.ఎస్.ఆర్ చేయూత పథకం క్రింద 4 వేల 7 మంది అక్కా చెల్లమ్మలకు 76
లక్షల 31 వెయ్యి 250 రూపాయిలు పంపిణీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
పాంచాలి గ్రామములో ఇళ్ల నిర్మాణం కోసం 1 కోటి 65 లక్షల 60వేలు చెల్లించామని
అన్నారు. గతంలో శాసన సభ్యులుగా గ్రామానికి 712 ఇళ్ళు ప్రత్యేకంగా మంజూరు
చేయించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అనధికారులు, సచివాలయం
సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.