గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కలను సాకారం చేసిన జగన్ మోహన్ రెడ్డి
జగనన్నే మా భవిష్యత్…మా నమ్మకం నువ్వే జగన్ అన్నది ప్రజల నినాదం
రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత వెల్లడి
క్యాంపు కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహణ.
కొవ్వూరు : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి చేపట్టిన ఈ నాలుగేళ్లలో
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందిస్తూ జగనన్నే మా భవిష్యత్.. మా నమ్మకం
నువ్వే జగన్ అని ప్రజలు నినదించేలా పరిపాలన అందించారని రాష్ట్ర హోం మంత్రి,
విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. మంగళవారం జగనన్న
ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని క్యాంపు
కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో విజయోత్సవ
సంబరాలను నిర్వహించారు. జయ జయ నినాదాల మధ్య హోంమంత్రి భారీ కేక్ కట్ చేశారు. ఈ
సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్,
మహాత్మా జ్యోతిరావు పూలే, బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో
అందిస్తున్న సుపరిపాలనకు నాలుగేళ్లు పూర్తయిందన్నారు. వై.ఎస్. జగన్ మోహన్
రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నిరుపేద, మధ్యతరగతి
ప్రజలకు అండగా ఉన్నారన్నారు. పేదలకు ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్లు
అందించడం, పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం సహా నాడు
నేడు పథకంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారన్నారు. ఆర్బీకేల ద్వారా రైతాంగం
పంట కొనుగోలుచేసేలా వారి సంక్షేమానికి కృషి చేశారన్నారు. రాజకీయాలకు అతీతంగా
అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించారన్నారు. ప్రజల కష్టం తమ కుటుంబ
కష్టంగా భావించి.. పేదలకు అండగా భరోసా ఇచ్చారని తెలిపారు.
పేదరిక నిర్మూలన, జనశ్రేయస్సే లక్ష్యంగా.. ప్రతి కుటుంబ సంతోషమే
ధ్యేయంగా పరిపాలన అందిస్తూ జగనన్న సంక్షేమ సంతకానికి నాలుగేళ్లు
పూర్తయ్యిందని తెలిపారు. ఈ నాలుగేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ
కార్యక్రమాలు ద్వారా అనేక వినూత్న, విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని
తెలిపారు. రేషన్ కార్డు మొదలుకొని సామాజిక పెన్షన్ల వరకూ కులాలు, మతాలు,
రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాల ఇంటి ముంగిటే
అందిస్తున్నామన్నారు. ఈ నాలుగేళ్లలో ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా
మహమ్మారిని రెండు సంవత్సరాలు ధైర్యంగా ఎదుర్కొన్నామన్నారు. కరోనా కారణంగా
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఎక్కడా సంక్షేమం మాత్రం
ఆగలేదన్నారు. మేనిఫెస్టో ను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావించి 98% హామీలను
అమలు చేశామని, మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా అమలు చేసి చూపామని స్పష్టం
చేశారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కలను సాకారం చేస్తూ సచివాలయ
వ్యవస్థను తీసుకొచ్చాం. ఇది దేశంలోనే ఒక చరిత్ అని తెలిపారు. వైఎస్ జగన్
మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అమలుచేయని
విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సేవలు అందిస్తోందని తెలిపారు.
గతంలోలా ప్రభుత్వాఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే సంప్రదాయానికి స్వస్తి
పలికి అవినీతికి లంచాలకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ
చేస్తున్నామన్నారు.
మహిళా సాధికారిత లక్ష్యంగా రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు రాజకీయంగా, ఆర్థికంగా,
సామాజికంగా పెద్దపీట వేశామన్నారు. రాష్ట్రంలో 31 లక్షల ఇంటి స్థలాలను మహిళల
పేరు మీదనే ఇచ్చామని గుర్తు చేశారు. నామినేటెడ్ పదవులు, నామినెటెడ్ పనుల్లో
మహిళా రిజర్వేషన్లు కల్పించామన్నారు. మహిళల భద్రత, రక్షణ కోసం దిశ బిల్లును
తీసుకొచ్చామన్నారు. మే 24న కొవ్వూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన, మే 29న
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భారీ ఎత్తున బైక్ ర్యాలీ, మే 30న విజయోత్సవ
వేడుకలను భారీ ఎత్తున నిర్వహించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. నాయకులు,
కార్యకర్తలు, అభిమానుల ఉత్సాహం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో 175 కి గానూ 175
స్థానాల్లో ఘనవిజయం సాధించడం ఖాయమని, ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ జగనన్నను
మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని హోంమంత్రి తానేటి వనిత పిలుపునిచ్చారు. ఈ
కార్యక్రమంలో నియోజక వర్గంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు,
కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.