అండగా మేముంటాం
25న కలెక్టరేట్ల వద్ద ధర్నాలను జయప్రదం చేయండి
ఏపీ జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
విజయవాడ : కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్రస్థాయిలో మరియు అన్ని
జిల్లాలలో సంఘాన్ని బలోపేతం చేసుకోవాలని, మీ సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ
అమరావతి అండగా ఉంటుందని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలోని లెనిన్ సెంటర్ నందు గల రెవెన్యూ భవన్లో
రాష్ట్రస్థాయి 26 జిల్లాల కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నాయకుల
సమావేశం జరిగింది. రాష్ట్ర చైర్మన్ కే. సుమన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో
బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర
ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగుల ఉన్నతికి ఏపీజేఏసీ అమరావతి కట్టుబడి ఉందని
తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి
పరిష్కరించే దిశగా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం చేపట్టిందని తెలిపారు. రెగ్యులర్
ఉద్యోగుల సమస్యలతో పాటు రాష్ట్రంలోని కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల
న్యాయమైన సమస్యలను కూడా ప్రభుత్వం ముందు ఉంచి వారికి కూడా న్యాయం చేయాలని
ప్రభుత్వాన్ని కోరిన ఏకైక ఉద్యోగ సంఘం ఏపీ జెఎసి అమరావతి అని తెలియజేశారు.
అందులో భాగంగానే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పై ఈనెల 25వ తేదీన
26 జిల్లాల కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆయా జిల్లాలోని కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగులు పెద్ద
ఎత్తున ఏపీ జేఏసీ అమరావతి జిల్లా శాఖలకు మద్దతు తెలిపి ఏపీ జెఎసి అమరావతి
ఉద్యమ ఉద్దేశాన్ని ప్రభుత్వానికి తెలియజేసేలా సహకరించాలని కోరారు.
ఏపీ జెఎసి అమరావతి కాంటాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఔట్సోర్సింగ్
ఉద్యోగులకు వేతన పెంపుపై ఇప్పటికే చీఫ్ సెక్రటరీ దృష్టికి రెగ్యులర్ ఉద్యోగుల
సమస్యల తో పాటు వాటిని కూడా తీసుకు వెళ్లినట్లు తెలుపుతూ సమస్యలు పరిష్కారం
అయ్యే దిశగా ఏపీ జేఏసీ అమరావతి చేపట్టే ఉద్యమంలో ఆయా జిల్లాల జేఏసీలతో కలిసి
కాంటాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని
పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు, ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర
పబ్లిసిటీ సెక్రటరీ బి. కిషోర్ కుమార్ అన్ని జిల్లాల కాంటాక్ట్ అవుట్
సోర్సింగ్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.