అమరావతి : పెన్షన్, జిపిఎఎఫ్ లకు సంబంధించి ఉద్యోగులు డిడిఓలకు(డ్రాయింగ్ అండ్ డిస్బెర్సుమెంట్ అధికారులు) గల వివిధ సందేహాలను నివృత్తి చేసేందుకే పెన్షన్, జిపిఎఫ్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతోందని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చంద్రమౌళి సింగ్ స్పష్టం చేశారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈనెల 19,20 తేదీల్లో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్, సచివాలయం సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న పెన్షన్, జిపిఎఫ్ అదాలత్ లో గురువారం ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చంద్రమౌళి సింగ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా పదవీ విరమణ పొందిన కొంత మంది ఉద్యోగులకు ఫెన్సన్ పేమెంట్ ఆర్డర్ల(పిపిఓ)ను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ మాట్లాడుతూ పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు సకాలంలో ఫెన్సన్ ప్రతిపాదనలు సమర్పణ, జిపిఎఫ్ కు సంబంధించిన అంశాల్లోను ఉద్యోగులు సంబంధిత డిడిఓలకు గల వివిధ సందేహాలను నివృత్తి చేసే లక్ష్యంతోనే ఈ జిపిఎఫ్ అదాలత్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ముఖ్యంగా పెన్షన్ గ్రీవియెన్సులకు సంబంధించి ప్రొవిజినల్ పెన్షన్ కేసులు, వెరిఫికేషన్ రిపోర్టుకు సంబంధిత కేసులు,గ్రాట్యుటీ విత్ హెల్డు, పార్టిలీ ఇస్యూడ్ కేసులకు సంబంధించి అటు ఉద్యోగులు,ఇటు డిడిఓలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడంతో పాటు అందుకు సంబంధించి వారికి గల సమస్యలను పరిష్కరించేందుకు ఈఅదాలత్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రిన్సిపల్ ఎజి చంద్రమౌళి సింగ్ తెలిపారు.