విద్యా వ్యవస్థలో పెను మార్పులకు సీఎం జగన్ శ్రీకారం
ఆంగ్ల భాషపై పట్టుతోనే జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవచ్చు
రాజమండ్రి : రాష్ట్ర సమగ్రాభివృద్ధి సంపూర్ణ అక్షరాస్యతతోనే సాధ్యమని
విశ్వసించిన సీఎం జగన్మోహన్ రెడ్డి అందుకు అనుగుణంగా విద్యారంగాన్ని
తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్,
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. శనివారం సాయంత్రం నగరంలోని శ్రీ
వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో రాజమండ్రి అర్బన్ పరిధిలో గల అన్ని విద్యా
సంస్థలలో 8వ తరగతి విద్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన టాబ్స్
పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేసి
ప్రసంగించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా విద్యార్థులకు
అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు పిల్లల మాతృమూర్తుల బ్యాంకు
ఖాతాలలో జమ చేయడం, అదే విధంగా నాడు నేడు పేరుతో పాఠశాలల
అభివృద్ధి, విద్యార్థులకు సాంకేతిక విద్యపై అవగాహన కోసం టాబ్స్
పంపిణీ ఇలా ఎన్నో చేస్తున్నారని చెప్పారు. విద్యార్థులు ఇటువంటి
చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు
అధిరోహించడానికి లక్ష్యాలు నిర్ణయించుకోవాలన్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం
వచ్చి 75 సంవత్సరాలు అయినా ఏ ప్రభుత్వం ఎందుకు విద్యారంగంపై దృష్టి
సారించలేదో అర్థం కావడం లేదన్నారు. కేవలం కార్పోరేట్ మాఫియా చేతుల్లో విద్యా
వ్యవస్థ ఉండటం వల్ల ప్రభుత్వాలు తమ స్వార్థం కోసం పట్టించుకోలేదని
స్పష్టమవుతోందన్నారు. సీఎం జగన్ ఒక్కరే విద్యార్థుల భవిష్యత్తు కోసం, పేదల కలల
సాకారం కోసం కృషి చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు విస్మరించరాదన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అనర్గళంగా ఆంగ్ల భాషలో మాట్లాడాలన్నదే సీఎం
జగన్ కోరిక అన్నారు. పిల్లలకు ఆంగ్లంపై పట్టు ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా
రాణించగలరని అన్నారు. తెలుగు భాషపై మమకారం ఉండాలని, అదే సమయంలో ఆంగ్ల భాషను
నేర్చుకోవాలనే ఆసక్తి తద్వారా మీ జీవిత లక్ష్యాన్ని అధిగమించాలని ఎంపీ భరత్
ఆకాంక్షించారు. ప్రతిపక్షాలు ప్రతీ విషయాన్ని రాద్ధాంతం చేస్తూనే ఉంటాయని,
అటువంటివి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడమే సీఎం జగన్ ఆశయమని అన్నారు.
విద్యార్థులంతా మీ వెనుక మీ మంచి కోరే శక్తి, భరోసా ఒకటుందని, అదే జగన్ మామయ్య
అని మాత్రం మరచిపోవద్దని హితవు పలికారు. చదవండి.. కలలు సాకారం
చేసుకోండి..జగనన్న ఆశలు, ఆశయాల సాధనకు నడుంబిగించండని ఎంపీ భరత్ విద్యార్థులకు
పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాస్ చంద్రబోస్,
రుడా ఛైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, కమిషనర్ కే దినేష్ కుమార్, నగర పార్టీ
అధ్యక్షుడు అడపా శ్రీహరి, పలువురు వైసీపీ నేతలు, విద్యా శాఖ అధికారులు
పాల్గొన్నారు.