పోలాకి : సచివాలయ వ్యవస్థతోనే సీఎం వైఎస్ జగన్ ఈ రాష్ట్రంలో సుపరిపాలనకు
అంకురార్పణ చేశారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం
పోలాకి మండలం గాతలవలసలో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని
ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. గ్రామాల్లో ప్రజల
దైనందిన జీవితంలో సచివాలయం విడదీయరాని భాగంగా మారిందన్నారు. సచివాలయ వ్యవస్థ
వల్ల గతంలో అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలు కూడా ఒకటొకటిగా పరిష్కారం
అవుతున్నాయన్నారు. సచివాలయాల పాలనను ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఒక
ఆదర్శంగా భావించి అధ్యయనం చేస్తున్నాయని తెలిపారు. ప్రజల అవసరాలను తీర్చే ఏకైక
వ్యవస్థగా సీఎం జగన్ సచివాలయాలను తీర్చిదిద్దారన్నారు. ఇటువంటి ఆదర్శనీయ
సంక్షేమపాలనపై పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతుంటారో ఆయనకే అర్ధం కాని స్థితిలో
ఉంటారన్నారు. ఆయనో… పూజకు పనికిరాని పువ్వులాంటి వాడని ఎద్దేవా చేశారు.
ఆయనకు నోటి దూల ఎక్కువ అని చెప్పారు. అసలు యువతకు ఆయన ఏ విషయంలో ఆదర్శమో
చెప్పాలని డిమాండ్ చేశారు. పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా బాధ్యతలు
నిర్వహించిన ధర్మాన ప్రసాదరావు రాజకీయ. జీవితం కోసం పుస్తకం వేసి చదువుకో అని
సూచించారు. ఎవరైనా విమర్శిస్తే చెప్పుతో కొడతావా..అలా అయితే నీకు దేనితో
కొట్టాలి..? అని ప్రశ్నించారు. ఈ సభ అనంతరం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం
కార్యక్రమంలో కృష్ణదాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయనతో పాటు డిసిసిబి
చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, వైఎస్ఆర్సిపీ నాయకులు ముద్దాడ భైరాగి నాయుడు,
కణతి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.