విశాఖపట్నం : ‘ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ప్రభుత్వం ఒప్పందం చేసుకునే ప్రతి
రూపాయి… ప్రజలకు చెప్పే ప్రతి లెక్కా… రాష్ట్రంలో పెట్టుబడుల రూపంలో
కార్యరూపం దాలిస్తేనే చెబుతాం తప్ప కేవలం గణాంకాలకు.. గొప్పలకు ఈ సమ్మిట్‌ను
వినియోగించుకోబోం’ అని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్
పేర్కొన్నారు. విశాఖలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజనతో కలిసి ఆయన విలేకరుల
సమావేశంలో మాట్లాడారు. 3, 4 తేదీల్లో ఇక్కడ జరిగే సదస్సులో తాజాగా జరిగే
ఒప్పందాల ద్వారా రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నాం.
ఎన్టీపీసీదే రూ.లక్ష కోట్ల వరకూ పెట్టుబడి ఉంటుంది. ప్రభుత్వం గ్రీన్
హైడ్రోజన్ హబ్‌గా దానిని ప్రతిపాదించింది. 25 దేశాల నుంచి ప్రతినిధులు, 14
మంది బ్రాండ్ అంబాసిడర్లు హాజరవుతారని పేర్కొన్నారు.
రూ.38 వేల కోట్ల పనులు : ‘అదానీ రెన్యువబుల్ ఎనర్జీకి సంబంధించి రూ.60వేల
కోట్ల పెట్టుబడులకు దావోస్‌లో గతంలో ఒప్పందం జరిగింది. 2022లో చేసుకున్న
ఒప్పందానికి 2028 వరకు గడువు ఉంది. దాదాపు 18 వేల కోట్లకు సంబంధించి ఇప్పటికే
లోకేషన్లు గుర్తించి ప్రభుత్వం నుంచి అనుమతులిచ్చాం. మొత్తంగా దావోస్‌లో
జరిగిన రూ.1.25 లక్షల కోట్ల ఒప్పందాల్లో దాదాపు రూ.38 వేల కోట్ల పనులు
మొదలయ్యాయి. అమరరాజా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ నడుస్తోంది. మన
రాష్ట్రంలో పెట్టాలనుకున్న పెట్టుబడులు ఇతర రాష్ట్రాల్లో పెడుతున్నట్లు ఆ
గ్రూపు ఛైర్మన్ ఎప్పుడూ చెప్పలేదు. విస్తరణలో భాగంగానే ఆ పరిశ్రమ పక్క
రాష్ట్రానికి వెళ్లిందని మంత్రి అమర్నాథ్ వివరించారు.
చంద్రబాబు మాకు బ్రాండ్ అంబాసిడర్ కావాలి : ‘ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు
ఏపీలో ప్రశాంతంగా హెరిటేజ్ కంపెనీని నడుపుతున్నారు. అనకాపల్లి, చిత్తూరులో 11
పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబునాయుడే మాకు బ్రాండ్ అంబాసిడర్
కావాలి. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టొద్దని మనవి
చేసుకుంటున్నానని మంత్రి పేర్కొన్నారు.
‘చెల్లికి మళ్లీ మళ్లీ పెళ్లా’? : ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడే కోడి గుడ్డు
పెట్టిందంటూ ఇటీవల కథ చెప్పిన పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ తాజాగా
‘చెల్లికి మళ్లీ మళ్లీ పెళ్లా..!?’ అంటూ వ్యాఖ్యానించారు. ‘గతంలో ఎంవోయూలు
జరిగినా పరిశ్రమలు స్థాపించని వారితో మళ్లీ ఎంవోయూ చేసుకుంటామంటే అర్థం లేదు.
పాత ఎంవోయూలను సదస్సులో కలపబోం’ అని చెబుతూ.. ‘చెల్లికి మళ్లీ మళ్లీ పెళ్లా’
అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘పాత ఎంవోయూల్లో అవసరాలేమున్నాయి? ప్రభుత్వం నుంచి
సహకారం అందలేదా? పారిశ్రామిక వేత్తలే ముందుకు రాలేదా? అనే విషయాలపై
చర్చిస్తామే తప్ప గతంలో ఎంవోయూ జరిగి పెట్టుబడి పెట్టలేదు కనుక తాజాగా ఒప్పందం
చేసుకోండి అని చెప్పే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు.