తాను నటించిన ‘యశోద’ సినిమా ట్రైలర్ చూసి, అభినందిస్తున్న వారందరికీ నటి సమంత తన సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. అభిమానుల ఆదరణ చూస్తోంటే తనకెంతో సంతోషంగా ఉందని, జీవితం తనపై విసురుతున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి తగిన శక్తిని ఇస్తోందని ఆమె పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితమే తాను ‘మయోసైటిస్’ తో బాధపడుతున్నట్టు తెలిసిందని, ప్రస్తుతం తాను చికిత్స పొందుతున్నానని ఆమె తెలిపారు. ఇది తగ్గిన తరువాత అందరికీ చెబుదామనుకున్నానని, నయం కావడానికి మరికొంత సమయం పట్టేట్టు ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రతీ విషయాన్ని దాచడం సమంజసం కాదని ఇప్పుడిప్పుడే తెలుస్తోందని, ఇప్పటికీ దుర్బలత్వాన్నీ ఎదుర్కొంటున్నానని ఆమె తెలిపారు. త్వరలోనే కోలుకుంటానని డాక్టర్లు చెప్పారనీ, తనకు మంచి రోజులు, చెడ్డ రోజులూ రెండూ ఎదురయ్యాయని అన్నారామె. దీనివల్ల భరించలేనంత మానసిక, శారీరక బాధను అనుభవించానని, అయితే ఇప్పుడు అంతా నయమైందని, మరో కొన్ని రోజులలో కోలుకుంటానన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారామె. సమంత సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తో పాటే ఆమె చేతికి సలైన్ ఉన్న పిక్ ను జతచేసింది. అదిచూసిన సమంత అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని, మళ్ళీ మునుపటిలా ఉత్సాహంగా ఉండాలంటూ అభిలషించారు. నవంబర్ 11న ‘యశోద’గా జనం ముందుకు రానున్నారు సమంత. అప్పటికంతా ఆమె ఆరోగ్యంగా ఆనందంగా తిరిగి వస్తారనే అభిమానులు ఆశిస్తున్నారు.