హైదరాబాద్ : న్యాయవ్యవస్థ సమర్థతకు కొలమానంగా కేసుల పెండెన్సీనే చూస్తారని,
బార్, బెంచ్ సమష్టిగా పనిచేస్తే కేసుల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే పేర్కొన్నారు. ప్రస్తుతం
పెండెన్సీ తగ్గించడానికి న్యాయమూర్తులు కృషి చేస్తున్నారని, తాను ప్రధాన
న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కేసుల పరిష్కార రేటు
పెరిగిందని తెలిపారు. స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా హైకోర్టు ఆవరణలో జాతీయ
పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జస్టిస్ ఆలోక్ అరాధే ప్రసంగిస్తూ రాష్ట్రంలో
అన్ని జిల్లా కోర్టులు ఒకేలా ఉండేలా ‘న్యాయ నిర్మాణ్’ డాక్యుమెంట్‌ను
హైకోర్టు విడుదల చేసిందన్నారు.కొత్తగా ఏర్పాటైన జ్యుడిషియల్ జిల్లాల్లో
కోర్టు సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వం 5 నుంచి 20 ఎకరాల దాకా భూమిని
కేటాయించిందన్నారు. వీటిలో న్యాయ నిర్మాణ్ డాక్యుమెంట్ ప్రకారం కోర్టుల
నిర్మాణాలకు పరిపాలన అనుమతుల కోసం హైకోర్టు ప్రతిపాదనలు సమర్పించిందని
తెలిపారు. హైకోర్టులో 2017 నుంచి రికార్డుల డిజిటైజేషన్ జరుగుతోందని,
ఇప్పటికి 8 కోట్ల పేజీల మేర పూర్తయిందని చెప్పారు. ఇ-ఫైలింగ్‌కు కూడా అవకాశాలు
కల్పిస్తున్నామని, కాగిత రహిత కోర్టు నిర్వహణకు ప్రయత్నాలు
జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్,
బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు
నాగేశ్వరరావు మాట్లాడారు. న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు,
రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో అత్యధిక మార్కులు
సాధించిన కోర్టు సిబ్బంది పిల్లలకు హైకోర్టులో అటెండర్‌గా పనిచేస్తున్న
జె.సి.విరూపాక్షరెడ్డి సౌజన్యంతో ప్రతిభా పురస్కారాలను ప్రధాన న్యాయమూర్తి
చేతుల మీదుగా అందజేశారు. బార్ కౌన్సిల్లో ఛైర్మన్ నరసింహారెడ్డి జాతీయ
పతాకాన్ని ఆవిష్కరించగా, వైస్‌ఛైర్మన్ సునీల్‌గౌడ్, బార్ అసోసియేషన్
అధ్యక్షుడు, సభ్యులు పాల్గొన్నారు.