గ్రామ వార్డు సచివాలయాలలో వెంటనే బదిలీల ప్రక్రియ చేపట్టాలి
రెగ్యులర్ పే స్కేల్ ప్రకారం జీతభత్యాలు చెల్లించాలి
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి
ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
విజయవాడ : సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి
చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. గ్రామ వార్డు సచివాలయ
ఉద్యోగులకు ప్రొబేషన్ ఆలస్యం చేసిన కారణంగా వారు కోల్పోయిన ఆర్థిక, అర్ధికేతర
అంశాల పైన ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ వార్డు
సచివాలయాలలో పనిచేస్తున్న మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మంట్ , అగ్రికల్చర్,
హార్టికల్చర్, సెరికల్చర్ డిపార్ట్మెంట్ వారికి మిగిలిన డిపార్ట్మెంట్ల మాదిరి
వెంటనే బదిలీల ప్రక్రియ చేపట్టాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాలలో కారుణ్య
నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన వారికి రెగ్యులర్ పే స్కేల్ ప్రకారం
జీతభత్యాలు చెల్లించాలని అన్నారు. ఆదివారం ఆంధ్ర ప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ
సంస్థ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడ గవర్నర్ పేటలోని రెవిన్యూ భవనంలో
జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ
సంస్థ 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్
బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ రావు మాట్లాడుతూ
ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ సంస్థగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ
ఉద్యోగుల సంక్షేమ సంస్థకు ఎల్లవేళల అండగా ఉండి వారి సమస్యలను పరిష్కరించే
దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ
ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల అర్లయ్య తెలిపారు. కొన్ని
ముఖ్యమైన అంశాల పై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించినట్టు తెలిపారు.
మొదట విడత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కోల్పోయిన 9 నెలలు, రెండవ విడత
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కోల్పోయిన 5 నెలలకి సంబంధించిన ఆర్థికపరమైన,
సర్వీస్ పరమైన అంశాల పైన ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి. గ్రామ వార్డు
సచివాలయ ఉద్యోగులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి. ఏఎన్ఎం, విఏఏ
(అగ్రికల్చర్), వీ హెచ్ ఏ (హార్టికల్చర్), వీ ఎస్ ఏ (సెరికల్చర్) వారికి ఇంకను
ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ మొదలు కానందున వారు కుటుంబాలకు దూరంగా ఉంటూ అనేక తీవ్ర
ఇబ్బందులకు గురవుతున్నారు కనుక వెంటనే వారికి బదిలీల ప్రక్రియ మొదలుపెట్టాలి.
కారుణ్య నియామకాలలో నియామకం అయినటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుకు
కన్సాల్డేటెడ్ పే 15,000 రూపాయలు కాకుండా రెగ్యులర్ పే స్కేల్ వర్తించే విధంగా
చర్యలు తీసుకోవాలి. సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించవలసినటువంటి సీపీటీ
పరీక్షను గత మూడున్నర సంవత్సరాలలో కేవలం మూడుసార్లు నిర్వహించడం వలన దాదాపు
200 మందికి పైగా పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 లు , అదేవిధంగా వీ ఆర్ వో
గ్రేడ్-2 లు సర్వే పరీక్షలలో ఉత్తీర్ణత సాధించని కారణంగా గత నాలుగేళ్ల కాలంగా
వారి ప్రొబేషన్ ప్రక్రియ పూర్తి కాక వారు నెలకు 15000 రూపాయలతో నే జీవనం
సాగిస్తున్నారు. కనుక ప్రభుత్వం వారి యందు సహృదయ భావంతో సీపీటీ పరీక్షలు,
సర్వే పరీక్షల నుండి మినహాయింపు ఇచ్చి వారికి తక్షణమే ప్రొబేషన్ పూర్తి చేసి
రెగ్యులర్ పే స్కేల్ వర్తింప చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి
చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రెటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ రావు
ఏపీ జెఎసి అమరావతి పక్షాన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ
ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర ప్రెసిడెంట్ ఆర్లయ్య, జనరల్ సెక్రెటరీ సీపాన
గోవిందరావు, రాష్ట్ర కోశాధికారి బగ్గా జగదీష్, ఉపాధ్యక్షులు జి జ్యోతి, సిహెచ్
హరి జాయింట్ సెక్రెటరీ కట్టా శ్రీను, అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఈ
సమావేశంలో పాల్గొన్నారు.