ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల, అధికారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వ
ఉద్యోగులందరూ వారి శాఖల అసోసియేషన్ లు అన్నీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు,
అధికారులు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటయ్యారు. వారు సంఘటితముగా
ప్రభుత్వము నుండి జరుగుతున్నటువంటి వివిధ రకాల విఘాతాలు, ప్రమోషన్ల లో
జరుగుతున్న అవకతవకలు, అలానే రూల్ ఆఫ్ రిజర్వేషన్ , కాన్సిక్వెన్షియల్
సీనియార్టీ మీద వివిధ రకాల ఇబ్బందుల నుండి తమను తాము పరిరక్షించుకొనుటకు,
క్యాచ్ ఆప్ రూల్ మీద వివిధ రకాల అన్యాయాలను సంఘటితంగా ఎదుర్కొనేందుకు పోరాటం
చేయడానికి జేఏసీగా ఏర్పడ్డారు. వివిధ సంఘాలన్నీ కలిసి ఏకగ్రీవముగా
జేఏసీచైర్మన్, సెక్రెటరీ జనరల్, ఇతర ప్రాముఖ్యతమైనటువంటి పదవులకు అభ్యర్థులను
మౌఖిక ఓటింగ్ ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేఏసీ చైర్మన్ గా ఎం. సునీల్
కుమార్, (జనరల్ సెక్రెటరీ, ఆంధ్ర ప్రదేశ్ ఎస్ సి, ఎస్ టి గవర్నమెంట్ ఆఫీసర్స్
వెల్ఫేర్ అసోసియేషన్), జేఏసీ సెక్రటరీ జనరల్ గా డాక్టర్ దేవర కొండ
వేంకటేశ్వర్లు , ( ఎస్ టి ఉద్యోగులు అసోసియేషన్), కన్వీనర్ గా డాక్టర్ బి.
రాజా శేఖర్ ,( ఏపీ ఎస్ సి, ఎస్ టి వెటర్నరీ అసోసియేషన్ ), మీడియా అండ్
పబ్లిసిటీ సెక్రటరీ గా శోభన్ బాబు (ఏపీ పాలిటెక్నిక్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్
అసోసియేషన్), ఫైనాన్స్ సెక్రటరీ గా రఘు (ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్
అసోసియేషన్) లను ఎన్నుకున్నారు.
చైర్మన్ గా ఎన్నికైన ఎం. సునీల్ కుమార్ మాట్లాడుతూ జేఏసీ సంఘటితముగా
సమస్యలపై శాశ్వతమైన పోరాటం చేయాల్సి ఉందని, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ఔనత్యమును
కాపాడుటకు ఇతర జేఏసీల వలె ఒక సమస్యపై కాక , శాశ్వతమైనటువంటి వివిధ
రకములైనటువంటి సమస్యల పరిష్కారం కొరకై మన శాశ్వత జేఏసీగా ఏర్పాటు చేయవలసిన
ఆవశ్యకత ఉన్నదన్నారు. ప్రస్తుతం ఉన్న వివిధ జేఏసీలు ప్రభుత్వ ఉద్యోగులుగా,
అధికారులుగా, ఉన్న ఎస్సీ ఎస్టీ అధికారులను ఉద్యోగులను, వారి సమస్యలను
పట్టించుకోకుండా, ప్రమోషన్ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ల సమస్యలపై పోరాటం చేయక
పోవటం వాళ్ళ ఎస్సీ ఎస్టీ అధికారులు, ఉద్యోగులు అందరూ కలిసి వారి సంఘముల
ద్వారా జేఏసీగా ఏర్పాటు కావాల్సి వచ్చిందన్నారు.
సెక్రటరీ జనరల్ గా ఎన్నికైన డాక్టర్ దేవర కొండ వేంకటేశ్వర్లు మాట్లాడుతూ
ఆంధ్ర ప్రదేశ్ సెక్రటేరియట్ లో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు,
ఆఫీసర్లకు, ప్రమోషన్లలో , రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో, కాన్సిక్వెన్షియల్
సీనియార్టీ అమలు చేయడంలో వివిధ రకాల లోపములతో అవకతవకలు జరిగాయన్నారు.
ఇటీవలి కాలంలో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఇచ్చిన
ఉత్తర్వులను అసోసియేషన్ సంఘటిత భావంతో ముందుకు వచ్చి ప్రభుత్వంతో చర్చించిన
తరువాత ఆ ఉత్తర్వులను ప్రధాన కార్యదర్శి నిలిపి వేసేలా ఉత్తర్వులు ఇచ్చారని
చెప్పారు.