ఆడబిడ్డలు కనిపించకుండాపోతుంటే ఎందుకు మాట్లాడరు?
ఈ అరాచకంపై టీవీల్లో చర్చలు పెడితే డబ్బులు రావేమో?
నేటి కష్టం వేరెవరిదో అనుకొంటే.. రేపు మన ఇంటి వరకు రాకపోదు
మన వ్యక్తిగత గోప్యత, సమాచారం వాలంటీర్లకు ఎందుకు?
పథకాల అమలుకు, పాలనకు ప్రభుత్వ వ్యవస్థలున్నాయి
నన్ను తిట్టుకున్నా ఫర్వాలేదు… ప్రజల్ని చైతన్యపరుస్తూనే ఉంటా
సంస్కారహీనుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో జగన్ చూపిస్తున్నాడు
దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు, వీర మహిళల సమావేశంలో పవన్ కళ్యాణ్
దెందులూరు : ప్రజాస్వామ్య పరిరక్షణకు న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ,
కార్యనిర్వాహక వ్యవస్థ అని మూడు బలమైన వ్యవస్థలు ఉన్పప్పటికీ వాలంటీర్లు అనే
మరో సమాంతర వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ ఎందుకు తీసుకొచ్చారని జనసేన పార్టీ
అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పాలన వ్యవస్థ తప్పు చేస్తే
కార్యనిర్వాహక వ్యవస్థకు, కార్యనిర్వాహక వ్యవస్థ తప్పు చేస్తే న్యాయ వ్యవస్థకు
ఫిర్యాదు చేయొచ్చు… మరి వాలంటీరు వ్యవస్థ తప్పు చేస్తే సరిదిద్దే వ్యవస్థ
ఏదని నిలదీశారు. వాలంటీర్లు ఇళ్ళల్లోకి వెళ్ళి సేకరిస్తున్న వ్యక్తిగత సమాచారం
ఎక్కడుంది? ఎవరికి పంపిస్తున్నారు? మొత్తం సమాచారాన్ని ఎక్కడ నిక్షిప్తం
చేస్తున్నారు? డేటా దుర్వినియోగం అయితే బాధ్యత ఎవరిదీ? సేవ చేయడానికి వచ్చిన
వాలంటీరుకు దాడి చేసే హక్కు ఉందా? ఆరేళ్ల బాలికపై వాలంటీర్ అఘాయిత్యం చేస్తే
జగన్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ప్రజలను నియంత్రిస్తూ, వైసీపీ పార్టీకి
ఎదురు తిరిగే వాళ్లను భయపెట్టడానికి ఉపయోగపడుతున్న ఈ సమాంతర వాలంటీరు వ్యవస్థ
నడుం విరగొట్టి తీరుతామని అన్నారు. మంగళవారం ఏలూరులో క్రాంతి కళ్యాణ మండపంలో
దెందులూరు నియోజకవర్గం నాయకులు, వీర మహిళలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ మీద వ్యక్తిగత ద్వేషం లేదు.
వైసీపీ విధానాల మీదే చిరాకు ఉంది. డిగ్రీ చదువుకునే యువతీ, యువకులను
తీసుకొచ్చి రూ. 5 వేల నెల జీతానికి వాలంటీరుగా పెట్టారు. ఉరకలెత్తే యువత
శ్రమను దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి, ఉపాధి
అవకాశాలు పెంచి యువతలో అవసరమైన స్కిల్ డవలప్ చేస్తే యువత భవిష్యత్తు
బాగుపడుతుంది. అది వదిలేసి ప్రజలను నియంత్రించడానికి వాలంటీర్ వ్యవస్థను పెంచి
పోషించి, రూ. 5 వేలకు వాళ్ల శ్రమను దోచుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి
రాకముందు ఎలాంటి వాలంటీర్ల వ్యవస్థలు లేవు. అప్పుడు సక్రమంగా నిత్యావసర సరుకుల
పంపిణీ జరిగింది. వాలంటీర్లు లేకపోతే రాష్ట్రం ఏం ఆగిపోదు. దేశంలో సమాంతర
వ్యవస్థలు ఎక్కువైపోయాయి. రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మితే ఇది ముమ్మాటికి
తప్పే అన్నారు.
వాలంటీర్ల అకృత్యాలపై ఫిర్యాదులు
వాలంటీర్ల అకృత్యాలపై జనవాణి కార్యక్రమంలో చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఇంట్లో
ఆడపిల్లలను వేధిస్తున్నా ఏం చేయలేకపోతున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. 50
ఇళ్లకు ఒక వాలంటీరును నియమించారు. వాళ్లతో వ్యక్తిగత సమాచారాన్ని
సేకరిస్తున్నారు. ఒక ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారు. ఒంటరి మహిళలు ఎంతమంది?
భార్యభర్తలు మధ్య గొడవలు ఉన్నాయా? అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయా? ఇలా
అన్ని విషయాలను వాళ్ల తెలుసుకుంటున్నారు. ఇంత సమగ్రంగా వ్యక్తిగత డేటా
సేకరించే అధికారం వాళ్లకు ఎక్కడిది? అని ప్రశ్నించారు.
జగన్ పబ్జీ ఆడుకుంటే ఇబ్బంది లేదు
జగన్ తన ఇంట్లో ఏం చేసుకున్నా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. పబ్జీ ఆడుకున్నా, ఆన్
లైన్ లో గ్యాంబ్లింగ్ ఆడుకున్నా మాకెలాంటి సమస్య లేదు. అదే ఆన్ లైన్
గ్యాబ్లింగ్ ను ప్రజల ధనంతో ఆడితే కచ్చితంగా తప్పుబడతాం. వైసీపీ వాళ్ళు అరగంట,
గంటా, పది గంటలు అని మాట్లాడుకున్నా సమస్య లేదు. అంతేతప్ప ఆడబిడ్డలను ఫోన్లు
చేసి వేధిస్తే సమస్యే. కచ్చితంగా నేరమే.
అత్యాచారాలు.. అదృశ్యాలు కనిపించవా?
పార్లమెంటులో ఇచ్చిన సమాచారం మేరకు 2019-21 మధ్య కాలంలో 18 ఏళ్లు దాటిన
ఆడబిడ్డలు 22,278 మంది మిస్ అయిపోయారు. ఇప్పటి వరకు ఆచూకీ తెలియని వారు 5,675
మంది ఉన్నారు. ఇంట్లో ఆడబిడ్డ కాసేపు కనిపించకపోతేనే విలవిల్లాడిపోతాము.
అలాంటింది 30 వేల మంది అదృశ్యమయితే దీనిపై ఎందుకు డిబేట్ పెట్టలేదు. కడప
జిల్లా పొద్దుటూరులో ఒక మాదిగ సామాజికవర్గానికి చెందిన మైనర్ బాలికపై చాలామంది
పలుమార్లు అత్యాచారం చేశారు. వాలంటీర్లు, సచివాలయం ఉద్యోగులు ఇలా చాలా మందికి
ఫిర్యాదు చేసింది ఎవరూ పట్టించుకోలేదు. ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు
వచ్చింది. ఇప్పుడు ఆ బాలిక స్త్రీశిశు సంక్షేమ హాస్టల్స్ లో ఉంటోంది. దీనిపై
ఎవరూ మాట్లాడరు. ఆడబిడ్డలపై అత్యాచారాలు, అదృశ్యాలు కనిపించడం లేదా? వాటిపై
టీవీల్లో డిబేట్లు పెట్టరా? అవి పెడితే డబ్బులు రావేమో? కానీ పవన్ కల్యాణ్
వ్యక్తిగత జీవితం గురించి మాత్రం డిబేట్లు పెడతారు.
నిఘా సాఫ్ట్ వేర్ అమరుస్తున్న జగన్
అంబేడ్కర్ మహానీయుడు నీ హక్కులు నువ్వు తెలుసుకో అనే సాఫ్ట్ వేర్ మన మైండ్ లో
పెడితే… హిట్లర్ నీ జాతి కానివాడిని ద్వేషించు అనే సాఫ్ట్ వేర్ పెట్టాడు.
గాంధీజీ సర్వమానవ సౌభ్రాతృత్వం అనే సాఫ్ట్ వేర్ పెడితే, జగన్ వాలంటీర్ల నిఘా
వ్యవస్థ అనే సాఫ్ట్ వేర్ పెడుతున్నాడు. వాలంటీర్లు ద్వారా జగన్
తెలుసుకుంటున్నాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడితేగానీ రాష్ట్రంలో
మిస్సింగ్ కేసుల గురించి ఎవరూ మాట్లాడలేదు. ఛానల్స్, పత్రికలు ప్రచురించలేదు.
దీనిపై వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడలేదు? మహిళా
కమిషన్ ఎందుకు స్పందించలేదు? ఇంతమంది ఆడబిడ్డలు అదృశ్యమయితే ఉదాసీనంగా ఉండటం
నాకు చేతకాదు. కడుపు మండిపోయింది.. అందుకే ఊగిపోతు మాట్లాడాను. ఆనాడు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ సీఎం పదవి కోసం ఊగిపోయి మాట్లాడాడు కదా..?
ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై ఉరితీయాలని ఊగిపోయాడు కదా..? మరి ఇప్పుడు ఆడబిడ్డలు
కనిపించకుండాపోతుంటే ఎందుకు ఊగిపోయి సమీక్ష చేయడు. నాడు ఆయనకు పదవి రాలేదు అని
కడుపుమంట అయితే, నాకు పేదోళ్లకు ఎందుకు న్యాయం జరగడం లేదు అని కడుపు మంట.
ఆయనది పదవీ వ్యామోహం. నాది పేదోడి ఆక్రందనల ఆవేశం అన్నారు.
బ్రిటీష్ రూల్ అమలు చేస్తున్నారు
వాలంటీర్లు వ్యవస్థ చిన్న తొండగా మొదలై ఊసరవెల్లిగా మారిపోయింది. ప్రజలను
నియంత్రించి, భయపెట్టే స్థాయికి వెళ్లిపోయింది. ఏ మనిషికైనా డబ్బు కంటే ఎదుట
వ్యక్తిని లొంగదీసుకోవడంలో ఆనందం ఉంటుంది. జగన్ దీనిమీదే ఆడుతున్నాడు. పులికి
రక్తం మరిగించాడు. అది మనల్ని చంపే వరకు ఆగదు. వాలంటీర్లు తిప్పి కొడితే 6
లక్షల మంది ఉంటారు. ప్రజలు దాదాపు 6 కోట్ల మంది ఉంటారు. బ్రిటీష్ వాడు 5 వేల
మందితో మొదట మనదేశాన్ని ఆక్రమించడానికి వచ్చాడు. మన దేశపు ఏజెంట్లతోనే మనల్ని
కంట్రోల్ చేశాడు. ఇప్పుడు 6 కోట్ల మందిని కంట్రోల్ చేయడానికి జగన లక్షల మంది
వాలంటీర్లను ఉపయోగిస్తున్నాడు. దీనిని ఎదుర్కోవడానికి ప్రజలు విజ్ఞానవంతులు
కావాలి. ఏం నష్టపోతున్నామో అర్ధం చేసుకోవాలి. మనం చెబుతున్న కీలకమైన విషయాన్ని
పక్కదారి పట్టించడానికి, ప్రజలకు అసలు విషయం అర్ధం కాకుండా చేయడానికి
అధికారపార్టీ ఆధ్వర్యంలో నాటకం మొదలైంది. డిబేట్ ను పక్కదారి పట్టించడానికి
వైసీపీ నాయకులు నన్ను వ్యక్తిగతంగా తిట్టినా మీరు పట్టించుకోవద్దు. వాళ్ల
ట్రాప్ లో అసలు పడొద్దు. ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో ప్రజలకు అర్ధం అయ్యేలా
చెప్పాలి. ప్రజల వ్యక్తిగత సమాచారం ఎక్కడికి పోతుందో తెలియజెప్పే బాధ్యత మనపై
ఉంది.
తప్పులను ఎత్తి చూపుతుంటే తట్టుకోలేకపోతున్నాడు
నా చిన్నప్పుడు గోడలపై తాకట్టులో భారతదేశం, రమిజాబీకి న్యాయం జరగాలి అనే
రాసుండేది. హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ లో భర్త కళ్ల ముందే రమిజాబీని
సామూహికంగా పోలీసులు అత్యాచారం చేశారు. దీనిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
తిరగబడింది. అత్యాచారం చేసిన పోలీసులకు శిక్షపడే వరకు పోరాడింది. ఒక చిన్న
కేసే కదా అని వైసీపీ మంత్రుల్లా వదిలేయలేదు. అదీ పోరాటం అంటే. వైసీపీ పాలనపై
ప్రజల్లో నైరాశ్యం కమ్మేసింది. పోరాట పటిమ మరిచిపోయారు. కళ్ల ముందే అన్యాయం
జరుగుతున్నా, సమస్యలు కమ్మేస్తున్నా పోరాడటం మర్చిపోయారు. గ్యాసిప్స్ కు,
అనవసర విషయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నేను అసలు సమస్యలను, చీకట్లో
చేస్తున్న వైసీపీ ఘనకార్యాలను ఎత్తి చూపే సరికి ఏపీని పట్టి పీడిస్తున్న జగన్
అనే జలగకు కోపం వచ్చింది. ఇంత వరకు జగన్ ఫ్యాక్షన్, కిరాయి మూకలనే చూశాడు. ఓ
విప్లవకారుడితో గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను.
సీఎం కుటుంబ సభ్యుల గురించి మనం మాట్లాడకూడదు
ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను మనం సంస్కారంతో మాట్లాడుతుంటే వాళ్లు మాత్రం మన
ఇంట్లో ఆడవాళ్లను ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒక సంస్కార హీనుడు
ముఖ్యమంత్రి ఎలా ఉంటుందో ఈతరం చూడటానికే జగన్ గెలిచాడు. చిన్నపిల్లలు వచ్చిన
సభలో నువ్వు వ్యక్తిగత విషయాలు మాట్లాడుతుంటే రాష్ట్రంలో రేప్స్ జరగకుండా
ఎందుకుంటాయి. యథా రాజా తథా ప్రజా. ఆంధ్ర సంరక్షణ బాధ్యతలు మనందరం తీసుకోవాలి.
చావుకు తెగించే రాజకీయాల్లోకి వచ్చాను. నా భద్రత గురించి మీరు ఆలోచించకండి.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సామాజిక, రాజకీయ భద్రత గురించి ఆలోచించండి. నేను 200
రోజులు పనిచేస్తే రూ. 400 కోట్లు సంపాధించగలను. జగన్ లాగా ఒక 50 లక్షలు పెట్టి
ఆన్ లైన్ లో గ్యాంబ్లింగ్ ఆడుకోవచ్చు. మనకు అన్నం పెట్టే సమాజానికి ఏదైనా
చేయాలని 18 ఏళ్ల వయసులోనే నిర్ణయించుకున్నాను. నాకు సమాజం, దేశం తప్ప ఏమీ
తెలియదు. అందుకు ఏ సమావేశంలో అయినా చివర జైహింద్ అంటాను. నేను మంచి చేస్తాను
అని భావిస్తే నాకు భుజం తట్టండని అన్నారు.
ప్రజలందరితో బైబై వైసీపీ చెప్పిద్దాం : నాదెండ్ల మనోహర్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఈ
ప్రభుత్వంలో శాసన సభ్యుడికి సైతం పాలనలో చోటు లేదు. కనీస గౌరవం కూడా దక్కడం
లేదు. స్పందించే బాధ్యత లేకుండా చేశారు. వాలంటీర్లతో మొత్తం వ్యవస్థను
నిర్వీర్యం చేసేశారు. ఎక్కడ చూసినా ప్రజల సమాచారం మొత్తం సేకరించి వారే
రాజుల్లాగా ప్రవర్తిస్తున్నారు. మాట్లాడితే వాలంటీర్లే సంక్షేమ వారధులని
చెబుతున్నారు. ఈ వ్యవస్థ వల్ల ప్రజల జీవితాల్లో ఏం మార్పు వచ్చింది. గ్రామీణ
రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గణపవరం వెళ్దామంటే రోడ్లు ఉన్న
పరిస్థితుల్లో వాహనాలు తిరిగే పరిస్థితులు లేవు. ప్రజల్ని మభ్యపెట్టడం కోసం
మీడియాలో ప్రకటనలు గుప్పిస్తూ బటన్లు నొక్కాం. బటన్లు నొక్కామని అంటున్నారు.
మీరు బటన్లు నొక్కడం వల్ల ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పు ఏంటి? ఇలాంటి అన్ని
అంశాలను క్రియాశీలక సభ్యులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ప్రజల్లో పవన్
కళ్యాణ్ పై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలి. నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ
ఎన్నికలకు సన్నద్దం కావాలి. రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ నాయకత్వం కోసం ఎదురు
చూస్తున్నారు. ఒక మార్పు వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. కార్యకర్తలంతా పవన్
కళ్యాణ్ ప్రతినిధులుగా ఆయనకు ప్రజలకు మధ్య వారధులుగా మారాలి. సమిష్టిగా
ముందుకు వెళ్లి ప్రభావం చూపాలి. రాష్ట్రంలో మార్పు తీసుకువచ్చి ప్రజలంతా బైబై
వైసీపీ చెప్పే విధంగా కలసి పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి
పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, రాష్ట్ర కార్యదర్శి
ఘంటసాల వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.