జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున
విశాఖపట్నం : జిల్లాలో అటవీ భూముల ఆక్రమణ దారులపై కఠిన చర్యలు చేపట్టాలని
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. కలెక్టరేటు
లోని తన ఛాంబర్ లో జిల్లా స్థాయి ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం సంబంధిత
శాఖల అధికారులతో నిర్వహించారు. అటవీ భూముల రక్షణ , సర్వే , జిల్లాలో హరిత వనాల
పెంపకం, సముద్ర తీర ప్రాంత సంరక్షణ తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు .
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ భూముల ఆక్రమణలు జరగకుండా పకడ్బందీగా
చర్యలు తీసుకోవాలని అటవీ అధికారులను ఆదేశించారు. అటవీ రక్షణలో భాగంగా అటవీ
సంపద అన్యాక్రాంతం కాకుండా, అక్రమ రవాణాలను అరికట్టేందుకు జిల్లాలో నిఘా
చేపట్టాలని తెలిపారు. హరిత వనాల పెంపకంలో భాగంగా జూలై నెలలో 15000 మొక్కలు
జియో టాగింగ్ చేసి, పూర్తి సంరక్షణ చర్యలతో నాటుటకు సిద్ధంగా ఉంచాలని
ఫారెస్ట్ , జివిఎంసి అధికారులను ఆదేశించారు. పరవాడ మండలం, ఇస్లాంపేట గ్రామంలో
ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి సర్వే చేయాలని
విఎమ్ఆర్డిఏ అధికారులను ఆదేశించారు. విశాఖ ఆర్కే బీచ్ లో గత కొన్ని
సంవత్సరాలుగా అభివృద్ధి పనులు చేయడం ద్వారా బీచ్ ప్రాంతం మొత్తం అదనపు లైట్లు
మరియు ఆర్టిఫిషియల్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీని వలన సముద్ర తాబేళ్లు
గుడ్ల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయిందని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా జిల్లా
కలెక్టర్ స్పందిస్తూ టర్టిల్ ఫ్రెండ్లీ బీచ్ ఏర్పాటుకు నో లైట్ జోన్లు ఏర్పాటు
చేయాలని జివిఎంసి అధికారులను ఆదేశించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 181
కేసులు బుక్ చేయడం జరిగిందని దీని ద్వారా 14.26 లక్షలు వసూలు చేయడం జరిగిందని
డి ఎఫ్ ఓ అన్నారు.
నాలుగు వన్యమృగాల కేసులు వివిధ దశలలో కోర్టులలో పెండింగ్ లో ఉన్నాయని
తెలిపారు. జిల్లాలో గంజా పెంపకం , అక్రమ రవాణా లేకుండా చూడాలని , అటువంటి
వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు . కొన్ని ప్రాంతాల్లో అక్రమ ఇసుక మైనింగ్
జరుగుతుందని, అరికట్టాలని అధికారులను ఆదేశించారు. అటవీ అధికారులు రెవెన్యూ,
సర్వే ల్యాండ్ అధికారులతో జాయింట్ సర్వే చేసి అటవీ భూముల సమస్యలను
పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె ఎస్
విశ్వనాథన్ , జిల్లా ఫారెస్ట్ అధికారి అనంత్ శంకర్ , జూ క్యురేటర్ నందిని
సలారియా, జివిఎంసి జోనల్ కమీషనర్ శ్రీనివాస్ , ఫారెస్ట్ అధికారులు తదితరులు
పాల్గొన్నారు.