సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు
ప్రభుత్వ హామీలకు కార్మిక సంఘాలు ఆమోదం
కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలం
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను జీవోల రూపంలో విడుదల చేసిన తరువాత పూర్తిగా సమ్మెను విరమిస్తామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చల అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. రూ. 21 వేల వేతనంతో పాటు, ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు. సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లిస్తామని తెలిపారు మంత్రి. అలాగే, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే 5-7 లక్షల వరకు సాయం పెంచామని తెలిపారు మంత్రి. 2019 నుంచి దరఖాస్తు చేసుకోని మృతుల కుటుంబాలు ఇప్పుడు చేసుకున్నా ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు మంత్రి. ఇక ఈ సంక్రాంతి పండుగకు ప్రతి కార్మికునికి రూ. 1000 కొత్త బట్టలు కొనుగోలుకు ఇస్తామని ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ ఇచ్చిన హామీలకు కార్మిక సంఘాలు ఆమోదం తెలిపాయని, అలాగే, హామీ అమలు కోసం గురువారం సాయంత్రానికి జీవో జారీ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
హామీలు జీవోలో లేకపోతే మళ్లీ సమ్మె ఆలోచన : కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం స్పందించి హామీ ఇచ్చిందని తెలిపారు. రూ. 21వేలకు వేతనం పెంచాలని కోరామని, ప్రభుత్వం అందుకు అంగీకరించిందన్నారు. సమ్మె కాలంలో జీతం, కేసుల ఉపసంహరణ కు హామీ ఇచ్చారని తెలిపారు. రాజధాని ప్రాంత కార్మికులను కూడా మున్సిపల్ పరిధిలోకి తేవాలని కోరామని, ఈ అంశాన్ని పరిశీలించి చెబుతామన్నారని తెలిపారు. గురువారం మినిట్స్ కాపీ, మూడు రోజుల్లో జిఒ ఇస్తామని మంత్రి చెప్పినట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి. ఇతర ఇంజనీరింగ్ విభాగాల సమస్యలపై తొమ్మిది మందితో కమిటీ వేస్తామని చెప్పారన్నారు. అలాగే, ఔట్ సోర్సింగ్‌లో ఉన్న సిబ్బందిని కాంట్రాక్టు పరిధిలోకి తేవాలని కోరామని, దీనిపై పరిశీలిస్తామని చెప్పినట్లు తెలిపారు. ప్రస్తుతం అయితే సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నామని, జీవో వచ్చాక వాటిని పరిశీలించి తదుపరి ప్రకటన చేస్తామన్నారు కార్మిక సంఘాల నేతలు. గురువారం నుంచి మున్సిపల్ కార్మికులందరూ పనుల్లోకి వెళ్లాలని ప్రకటించారు. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు జీవోలో లేకపోతే మళ్లీ సమ్మె ఆలోచన చేస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు.
సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. కార్మిక సంఘాలతో బుధవారం సాయంత్రం మంత్రి వర్గ ఉపసంఘం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం అయిన వెంటనే సమ్మె విరమణ ప్రకటన చేశాయి సంఘాలు. దీంతో బుధవారం నుంచి మున్సిపల్ కార్మికులు యధావిధిగా తమ విధులకు కార్మికులు హాజరు కానున్నారు. పలు డిమాండ్ల సాధనతో మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగారు. అయితే గత చర్చల్లో ప్రభుత్వం వాళ్ల డిమాండ్‌కు సానుకూలంగా స్పందించినప్పటికీ కొన్ని విషయాలపై స్పష్టత రాలేదు. దీంతో బుధవారం మరోసారి భేటీ కావాల్సి వచ్చింది. చివరకు చర్చలు సఫలం కావడం, సమ్మె విరమణకు కార్మిక సంఘాలు అంగీకరించడంతో ముగింపు పడినట్లయ్యింది.
సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం నష్టపరిహారం : మున్సిపల్ కార్మికులు సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ హామీలకు కార్మిక సంఘాలు ఆమోదం తెలిపాయని పేర్కొన్నారు. 21 వేల వేతనంతో పాటు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని, సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లిస్తామని తెలిపారు. వారిపై ఉన్న కేసులు ఎత్తివేస్తామన్నారు. ఈ సంక్రాంతికి ప్రతి కార్మికునికి కొత్త బట్టల కోసం వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. చనిపోయిన కార్మికులు కుటుంబాలకు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం నష్టపరిహారం అందిస్తామని మంత్రి బొత్స అన్నారు. ప్రమాదవశాత్తూ మరణిస్తే అందించే సాయాన్ని అయిదు నుంచి ఏడు లక్షలకు పెంచినట్లు తెలిపారు. 2019 నుంచి దరఖాస్తు చేసుకోని మృతుల కుటుంబాలు ఇప్పుడు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. జీవో ఇచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే రెండు నెలల్లో ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు.