ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు
వెలగపూడి : ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ లిస్ట్ లో చిన్న చిన్న పొరపాట్లను, స్థానికంగా కొంతమంది ఇస్తున్న ఫిర్యాదులపై కనీసంఏం జరిగిందో తెలుసుకోకుండా బి ఎల్ వోలు విధులు నిర్వహిస్తున్న వారికి షోకాజ్ నోటీస్ ఏమీ ఇవ్వకుండా నేరుగా జిల్లా కలెక్టర్లు సస్పెండ్ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు ఖండించారు. ఉద్యోగస్తులు కేవలం ఒక బి ఎల్ ఓ డ్యూటీ లు కాకుండా వారి విధి నిర్వహణలో అనేక రకమైన విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. కేవలం బి ఎల్ ఓ విధులలో చిన్న, చిన్న, పొరపాట్లను సాకుగాచూపి కింది స్థాయిలో చిన్న ఉద్యోగులను సస్పెన్షన్లకు, గురి చేయడం చాలా బాధాకరమన్నారు. ఈ విషయంపై అన్ని జిల్లాల అధికారులు పునరాలోచించి వెంటనే సస్పెండ్ చేసిన బిఎల్ఓ లను విధుల్లోకి తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బిఎల్ఓలు అందరూ స్వచ్ఛందంగా బి ఎల్ ఓ విధులను బహిష్కరించడం జరుగుతుందన్నారు. బిఎల్ఓ విధులు నిర్వహిస్తున్న వారికిచ్చే గౌరవ భృతి కూడా రెండు సంవత్సరాల నుండి ఇవ్వడం లేదని, ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం రాలేదన్నారు. ఎన్నికల సమయములో ఎన్నికలు నిర్వహించడానికి బి ఎల్ వో లకు గ్రామస్థాయిలో ఎన్నికల అధికారులకు ఏర్పాట్లు చేయండని చెప్పడం జరుగుతుందని, దానికి సంబంధించి నిధులు ఏమీ కూడా ఇవ్వకుండా బిఎల్ఓ లపై భారం వేస్తున్నారన్నారు. ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లకు ముందుగానే బడ్జెట్ కేటాయింపులు చేయాలని కోరారు.