సంగారెడ్డి : ‘‘ఒకప్పుడు సైన్యం ఎక్కువగా ఉంటే ఆ దేశం శక్తిమంతమైంది. ఇప్పుడు
సాంకేతికతలో ముందున్న దేశానిదే ఆ స్థానం’’ అని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్
స్పష్టంచేశారు. ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన 12వ స్నాతకోత్సవంలో 980 మంది
విద్యార్థులకు వివిధ డిగ్రీల పట్టాలను ప్రదానం చేశారు. సీఎస్ఈ విభాగం
విద్యార్థి జి.కార్తీక్ బాలాజీకి రాష్ట్రపతి బంగారు పతకం, నలుగురు
విద్యార్థులకు బంగారు, 38 మందికి వెండి పతకాలు అందజేశారు. ముఖ్యఅతిథిగా
పాల్గొన్న సోమనాథ్ మాట్లాడుతూ ‘‘మన సొంత పరిజ్ఞానంతో రూపొందించి, అభివృద్ధి
చేసిన చంద్రయాన్-3 నిర్ణీత కక్షలో దూసుకెళుతుంటే ఆనందంగా ఉంది. వైద్యులు
మనిషి గుండె పనితీరు తెలుసుకునేందుకు ఈసీజీ చూసినట్లు, చంద్రయాన్-3 రాకెట్‌ను
అంతరిక్షంలోకి పంపే సమయంలో తెరపై గ్రాఫిక్స్‌ను మేం అలాగే పరిశీలించాం.
రాకెట్లు అంటే నాకు అమిత ఇష్టం. అవి పిల్లలతో సమానం. భవిష్యత్తులో మానవ సహిత
రాకెట్లు కూడా అంతరిక్షయానం చేసే రోజు వస్తుంది. వ్యాధులను జయించి జీవిత
కాలాన్ని పెంచుకున్న మనిషి… ఇప్పుడు సాంకేతికత దన్నుగా శాశ్వతంగా జీవించాలని
ప్రయత్నిస్తున్నాడు. మెటీరియల్ సైన్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, క్వాంటమ్
టెక్నాలజీ, డేటా సైన్స్, ఏఐ అండ్ ఎంఎల్, బయో టెక్నాలజీలు మానవ జీవితాన్ని
ఇప్పుడున్న దానికంటే మరింత మెరుగ్గా చేస్తాం. దేశంలో సాంకేతికత ఎంత అభివృద్ధి
చెందితే అంతమేరకు ప్రగతి సాధ్యమవుతుంది. భవిష్యత్తులో మనుషులకు, రోబోలకు మధ్య
అంతరం చెదిరిపోయే అవకాశముంది. బృందాలతో పని చేయడానికి పరిశోధక విద్యార్థులు
ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. కనీసం ఒక సబ్జెక్టుపై లోతుగా అధ్యయనం చేయాలి.
ఐఐటీయన్లంతా భారత దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాలి’’ అని సూచించారు. ఐఐటీహెచ్
బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ డా.బి.వి.ఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ…
పరిశోధనలు, ఆవిష్కరణల్లో ఐఐటీహెచ్ ఆదర్శంగా ఉంటోందని అభినందించారు. ఐఐటీహెచ్
డైరెక్టర్ ఆచార్య బి.ఎస్.మూర్తి మాట్లాడుతూ ‘‘ఐఐటీహెచ్ 130 స్టార్టప్‌లను
ప్రోత్సహిస్తోంది. వెయ్యికి పైగా ఉద్యోగాలు కల్పించింది. ప్రస్తుతం
పట్టాలందుకున్న వారిలో కృత్రిమ మేధలో ఇంజినీరింగ్ కోర్సును పూర్తిచేసిన
విద్యార్థులు కూడా ఉన్నారని తెలిపారు.