2,200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు
బాసర ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవానికి హాజరైన మంత్రి కేటీఆర్
బాసర : సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.
విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రపంచంతో
పోటీపడగలిగే సత్తా సంతరించుకోగలిగితే ఆపగలిగేవారు ఉండరని చెప్పారు.
కంప్యూటర్లే మానవ మేథస్సును అధ్యయనం చేస్తున్నాయన్నారు. ఆర్టిఫిషియల్
ఇంటలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కీలక పాత్రపోషిస్తున్నాయని చెప్పారు.
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు సబితా
ఇంద్రారెడ్డి, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి
కేటీఆర్ మాట్లాడుతూ.. పుస్తకాల్లో చదువుకున్న చదువుకు ప్రయోగాత్మక విద్య
తోడైతే ఫలితాలు దక్కుతాయని వెల్లడించారు. విద్యాలయాలను పరిశ్రమలతో
అనుసంధానించాలని సూచించారు. వర్సిటీలు డిజైనింగ్ కోర్సులకు రూపకల్పన
చేయాలన్నారు. ఉన్నత విద్యాలయాల్లో మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి
ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలను మరింత మెరుగ్గా
తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. ఆర్జీయూకేటీలో 2,200
మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తున్నామని అన్నారు. పీ1, పీ2లో 1500
మంది విద్యార్థుకు డెస్క్‌టాప్‌లు అందిస్తున్నామని చెప్పారు. ఆర్జీయూకేటీలో
చదువుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు
ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యమని చెప్పారు. టీహబ్‌తో బాసర ట్రిపుల్ ఐటీ
ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ శాటిలైట్
పంపింది హైదరాబాద్ టీ హబ్ కంపెనీయేనని గుర్తుచేశారు. పది మందికి ఉపాధి
కల్పించే స్థాయికి మనం ఎదగాలని చెప్పారు. ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం
అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యాసంస్థలతో
ప్రపంచ స్థాయి సంస్థలు ఒప్పందం కుదుర్చుకుంటున్నాయని తెలిపారు. అమెజాన్ లాంటి
కంపెనీలు మన పిల్లలకు అత్యధిక జీతాలు ఇస్తున్నాయని చెప్పారు. విదేశీ విద్య
కోసం రూ.20 లక్షలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు.
యూనివర్సిటీలో ఉన్న చెరువును బాగుచేయించే బాధ్యత తనదన్నారు. మిషన్ భగీరథ
ద్వారా రక్షిత మంచినీళ్లు క్యాంపస్‌కు రావాలన్నారు. సైన్స్ బ్లాక్ ఏర్పాటుకు
రూ.5 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. విద్యార్థుల కోసం ప్రత్యేక దవాఖాన
ఏర్పాటు చేస్తామన్నారు. ట్రిపుల్ ఐటీకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానన్నారు.
ఉన్నత విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి
కేటీఆర్ స్పష్టం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవానికి హాజరైన కేటీఆర్
కీలక ఉపన్యాసం చేశారు. సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదవలేదని.. విద్యార్థులు
సృజనతో ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రపంచంతో పోటీపడే సత్తా
సంతరించుకోగలిగితే అపగలిగేవారు ఎవరూ ఉండరన్నారు. పుస్తకాల్లో చదివిన చదువుకు
ప్రయోగాత్మక విద్య తోడైతే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. విద్యాలయాలను
పరిశ్రమలతో అనుసంధానించాలని సూచించారు. విశ్వవిద్యాలయాల్లో డిజైనింగ్
కోర్సులకు రూపకల్పన చేయాలని నిర్దేశించారు. అంతకుముందు బాసర ట్రిపుల్ ఐటీలో
విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై అధికారుల తీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం అందించేందుకు టెండర్లు పిలవడం ఏమైనా అంతరిక్ష
సమస్యనా? అని అధికారులను ప్రశ్నించారు. గతంలో తాను పర్యటించినప్పుడు
విద్యార్థులకు ఇచ్చిన హామీలపై కేటీఆర్ ఆరా తీశారు. ఆర్జీయూకేటీలో టీ-హబ్
ఏర్పాటకు మంత్రుల సమక్షంలో టీ-హబ్ ప్రతినిధులు, ఆర్జీయూకేటీ అధికారులు
ఒప్పందం చేసుకున్నారు. 2,200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఏకరూప
దుస్తులు అందజేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, దేవాదాయశాఖ
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.