నియోజకవర్గానికి 3 వేల మందికి ‘గృహలక్ష్మి’
4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు
దశాబ్ది ఉత్సవాల్లోనే బీసీ, ఎంబీసీ కులాలకు ఆర్థిక సాయం
తెలంగాణ కీర్తిని చాటిచెప్పేలా అవతరణ ఉత్సవాలు
జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
హైదరాబాద్ : యాసంగి నాట్లు, కోతలు ఆలస్యమవడం వల్ల ప్రకృతి విపత్తులతో పంటలను
నష్టపోతున్నామని, దీన్ని నివారించేందుకు యాసంగితోపాటు వానాకాలం సాగు కాలాన్ని
కూడా ముందుకు జరపాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
దీనివల్ల ఒనగూరే ప్రయోజనాలపై వ్యవసాయశాఖ సహకారంతో జిల్లా కలెక్టర్లు
రైతాంగాన్ని చైతన్యపరచాలని ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ
సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో నిర్వహించిన
సమావేశంలో పలు అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గానికి మూడు వేల
మంది చొప్పున అర్హులైన లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకాన్ని వర్తింపచేయాలని
ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పథకం కొనసాగుతుందని స్పష్టం
చేశారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆయా దశల ఫొటోలు, ఇతర మార్గాల ద్వారా
నిర్ధారించుకుని, నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ.. లబ్ధిదారులకు దశలవారీగా
ఆర్థికసాయం అందించాలన్నారు. సొంత జాగాలున్న లబ్ధిదారులకు పునాది దశలో రూ.లక్ష,
స్లాబ్ దశలో మరో రూ.లక్ష, ఇంటి నిర్మాణం పూర్తయిన ఆఖరి దశలో మరో రూ.లక్ష..
మొత్తంగా రూ.3 లక్షలు అందచేయాలని సీఎం తెలిపారు. ఇందుకు విధివిధానాలను
రూపొందించి, ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించాలని సీఎస్ శాంతికుమారిని
ఆదేశించారు.
పోడు భూముల పంపిణీతో 1.50 లక్షల మందికి లబ్ధి : రాష్ట్రవ్యాప్తంగా 2845
గ్రామాలు, తండాలు, గూడేల పరిధిలో ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో ఉన్న 4,01,405
ఎకరాల పోడు భూములకు పట్టాలు అందచేయాలని నిర్ణయించినట్లు సీఎం ప్రకటించారు.
తద్వారా 1,50,224 మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. జూన్ 24 నుంచి 30 వరకు
పోడు పట్టాల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. పట్టాలు అందించిన వెంటనే ప్రతి
లబ్ధిదారుని పేరుతో బ్యాంకు ఖాతాను తెరిపించాలని, ఈ బాధ్యత గిరిజన సంక్షేమ
శాఖ, కలెక్టర్లదేనని సీఎం స్పష్టం చేశారు. ఈ ఖాతాల ద్వారా లబ్ధిదారులకు
రైతుబంధు మొత్తాన్ని జమ చేస్తామని తెలిపారు. 3.08 లక్షల మంది ఆరోఓఎఫ్ఆర్
పట్టాదారులకు కూడా రైతుబంధును వర్తింపచేస్తామన్నారు. మంత్రులు, శాసనసభ్యులు,
ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం
చేయాలని కలెక్టర్లకు సూచించారు. పదేళ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానంలో
ఆదర్శంగా నిలిచిన ఆయా శాఖలను అభినందించారు. జూన్ 2 నుంచి మూడు వారాల పాటు
సాగే దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా జరపాలని సూచించారు.
వీటి నిర్వహణ కోసం కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ
అధికారులను సీఎం ఆదేశించారు.
బీసీ, ఎంబీసీ కుల వృత్తుల రక్షణే లక్ష్యం : ‘బీసీ కులవృత్తులను కాపాడడమే
రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న విశ్వకర్మలు
తదితర బీసీ, ఎంబీసీ కులాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల
ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
అధ్యక్షతన ఏర్పడిన ఉప సంఘం దీనికి విధి విధానాలు ఖరారు చేస్తుంది. జూన్ 9న
నిర్వహించే తెలంగాణ సంక్షేమ సంబురాల్లో ఉప సంఘం సిఫారసు చేసిన బీసీ, ఎంబీసీ
కులాల వారికి ఆర్థికసాయాన్ని అందించనున్నాం. దళితబంధు పథకం కింద ప్రతి
నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి క్రమపద్ధతిలో అమలు చేయాలి.
గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రారంభించి
దశలవారీగా అమలు చేయాలని కోరారు.
నాట్ల ఆలస్యంతో పంట నష్టాలు : ప్రాజెక్టులతో సాగునీరు సమృద్ధిగా అందుబాటులో
ఉంది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు లభిస్తోంది. భూగర్భ జలాలు పెరిగాయి. ఈ
నేపథ్యంలో మన రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా యాసంగి
నాట్లు ఆలస్యం కావడం వల్ల కోతలు కూడా ఆలస్యమవుతున్నాయి. మార్చి 31 లోపే
జరగాల్సిన కోతలు మే నెల దాటినా కొనసాగుతున్నాయి. దాంతో ఎండాకాలంలో వచ్చే అకాల
వర్షాలు, వడగండ్ల వానలతో వరి, తదితర పంటలు నష్టపోతున్నాం. ఈ బాధలు తప్పాలంటే
నవంబరు 15-20 తేదీల్లోపు యాసంగి వరి నాట్లు వేసుకోవాలి. అందుకు అనుగుణంగా
వరినాట్లను కూడా ముందుకు జరుపుకోవాలి. రోహిణీ కార్తె ప్రారంభంలోనే వానాకాలం
వరి నాట్లు మొదలు కావాలి. మే 25 నుంచి జూన్ 25 వరకు వరినాట్ల ప్రక్రియ పూర్తి
కావాలి. ఈ దిశగా వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుంటూ రైతులను చైతన్యవంతం చేసే
బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలన్నారు.
ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ కంటే మిన్నగా : వ్యవసాయం, ఐటీ, పరిశ్రమలు,
విద్యుత్ సహా అన్ని రంగాల్లో దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉంది. నాడు 8 లక్షల
టన్నుల ఎరువుల వినియోగం.. 28 లక్షల టన్నులకు పెరిగింది. గంజి కేంద్రాలు నడిచిన
పాలమూరులో నేడు పచ్చని పంటలతో, పారే వాగులతో, పాలుగారే పరిస్థితి నెలకొంది.
ధాన్యం ఉత్పత్తిలో మనం పంజాబ్‌ను అధిగమిస్తున్నాం. ధాన్యం దిగుబడి 3 కోట్ల
టన్నులను దాటిపోతున్న నేపథ్యంలో అందుకు అనుగుణమైన చర్యలను కలెక్టర్లు
చేపట్టాలి. అకాలవర్షాలు, వడగండ్ల వానల వల్ల కలిగిన కష్టనష్టాలను గుణపాఠంగా
తీసుకుని, పంట విధానాలను మార్చుకోవాలన్నారు
ఉత్సవాల చిత్రీకరణ : 21 రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాలను జిల్లాల వారీగా
వీడియో రికార్డుచేసి భద్రపర్చాలి. నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా జరిగిన
అభివృద్ధిని తెలిపే పదేళ్ల ప్రగతి నివేదిక పుస్తకాలను ముద్రించి అందచేయాలి.
నేడు విద్య, వైద్యరంగాల్లో తెలంగాణ అత్యద్భుత ఫలితాలను అందుకుంటూ దేశానికే
ఆదర్శంగా నిలిచింది. మన విద్యార్థులు నీట్, ఐఏఎస్‌ల్లో దేశంలోనే ముందు వరుసలో
ర్యాంకులు సాధిస్తూ తెలంగాణ కీర్తిని చాటుతున్నారు. నారాయణపేట ఎస్పీ
వెంకటేశ్వర్లు కుమార్తె సివిల్ సర్వీసెస్‌లో మూడో ర్యాంకు సాధించడం
అభినందనీయం అన్నారు.