గవర్నర్ అబ్దుల్ నజీర్
విజయవాడ : సామాజిక, ఆర్థిక ప్రగతిని నిర్దేశించే విలువైన సాధనమే ఓటు అని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో సీఎస్ జవహర్ రెడ్డి, సీఈవో ముకేష్ కుమార్‌తో కలిసి గవర్నర్ పాల్గొన్నారు. ఓటరు నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కలెక్టర్లకు పురస్కారాలు అందజేశారు. యువ ఓటర్లకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. భవిష్యత్‌కు పునాది వేసే ప్రజాస్వామ్య ఉత్సవంలో ఓటర్లందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు ద్వారా దేశ భవిష్యత్‌ను మార్చడంలో ప్రతి పౌరుడిదీ ప్రధాన పాత్ర. ఓటు వేయడం అనేది పౌరుడి ప్రధాన బాధ్యత కూడా. దేశ అభివృద్ధి గమనాన్ని నిర్దేశించడంలో పౌరులు అంతా తమ బాధ్యతను నెరవేర్చాలి. సామాజిక, ఆర్థిక ప్రగతిని నిర్దేశించే విధానాలు సక్రమంగా ఉండాలంటే పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకుని దేశ భవిష్యత్‌ను నిర్దేశించడంలో ప్రధాన పాత్రను పోషించాలి. ఓటు అనే వెలకట్టలేని విలువైన ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. మన ప్రతినిధిని ఓటు ద్వారా ఎన్నుకోవడం అంటే మన హక్కులను మనం రక్షించుకోవడమే. భవిష్యత్‌కు పునాది వేసే ప్రజాస్వామ్య ఉత్సవంలో ఓటర్లంతా పాల్గొనాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. భారత్‌లో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఉందని, ఇందులో ఓటు హక్కు చాలా కీలకమని సీఎస్ కె. ఎస్ జవహర్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఓటు హక్కు కల్పించేలా మన ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుందని తెలిపారు. 1949లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడే మనకు ఓటు హక్కు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారన్నారు.1989లో ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు కుదించారని తెలిపారు. సుప్రీం అధికారాలు అన్ని ప్రజల వద్దే ఉన్నాయన్నారు. ఓటు హక్కు ద్వారానే అది నాయకత్వానికి బదిలీ అవుతుందని అన్నారు. ప్రజలకు ఓటు అనే సార్వభౌమాధికారం ఉందన్న ఆయన దేశాలు అభివృద్ది చెందాలంటే ఓటు వేయడం చాలా ముఖ్యమని సీఎస్ కె. ఎస్. జవహర్‌రెడ్డి అన్నారు.