టిక్కెట్ల కేటాయింపులో సమన్యాయం
ప్రజలకోసం రూ.4 లక్షల కోట్లు పైగా సంక్షేమ పథకాలకు ఖర్చు
శతశాతం ఫలితాలు సాధిద్దాం
కలసికట్టుగా గెలిపిద్దాం
జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
సామాజిక న్యాయమే జగనన్న అజెండా అని మరోసారి నిరూపించుకున్నారని జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం సాయంత్రం నరసన్నపేటలో టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గ సమన్యయకర్తలు దువ్వాడ శ్రీనివాస్, పిరియా విజయ, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ లతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎల్లప్పుడూ నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని అంకితభావంతో వారి సంక్షేమం కోసం తపిస్తున్నారని అన్నారు. అందువల్లే రాజ్యాధికారంలో కూడా వారందరికీ పెద్దపీట వేయాలనే సంకల్పంతోనే ఉంటారన్నారు. ఈ విషయం మరోసారి రుజువుచేశారన్నారు. జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు, పార్లమెంటు నియోజకవర్గానికి సమన్వయకర్తలుగా బీసీలనే నియమించి బీసీల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారని అన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ సమన్యయకర్త పిరియా విజయను, టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దువ్వాడ శ్రీనివాస్‌ను, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా పేరాడ తిలక్ ను నియమించారన్నారు. మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఇదేవిధంగా సిఎం జగన్ సామాజిక సమతూకాన్ని పాటించనున్నారన్నారు. ఎల్లప్పుడూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనార్టీలను ఉపయోగించుకుని అందలాలెక్కే చంద్రబాబునాయుడు తన అవసరం తీరాక వారిని తొక్కేశారని, కానీ జగన్ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ వారందరికీ న్యాయం జరుగుతోందన్నారు. పార్టీ నిర్దేశాలకు అనుగుణంగా కలిసికట్టుగా పనిచేసి శతశాతం ఫలితాలు సాధిస్తామన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ నేటి వరకూ ప్రజలకోసం రూ4 లక్షల కోట్లుపైగా సంక్షేమ పథకాల కింద ప్రజలకు అందించామన్నారు. ప్రతి ఇంటా అభివృద్ధి జరిగిందన్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి ఏమిటో అంతా కళ్ళముందే అందరికీ కనిపిస్తోందని అన్నారు. 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో కచితంగా వైసీపీ విజయం సాధిస్తుందన్నారు. ఈ సమావేశంలో కళింగకొమటి కార్పొరేషన్ అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ఆరంగి మురళి, కోరాడ చంద్రభూషణ్ గుప్తా, రాజాపు అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
విజయం సాధించి తీరుతా : ఇచ్చాపురం సమన్వయకర్త పిరియా విజయ
ఇచ్చాపురం నియోజకవర్గంలో కచ్చితంగా వైసీపీ విజయాన్ని సాధిస్తుంది. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వైసీపీని గెలిపించడానికి కృషిజరుగుతోంది. మొట్టమొదటిగా ఈశాన్యం మూలలో ఉన్న ఇచ్చాపురం నుంచే వైసీపీకి తొలివిజయాన్ని ఇచ్చేలా ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. గడప గడపకూ ఘనస్వాగతాలు పలుకుతున్న ప్రజలే ఇందుకు రుజువు.
వైసీపీ విజయం తధ్యం : టెక్కలి సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్
టెక్కలి నియోజకవర్గంలో మరింత సమన్వయంతో కృషిచేసి విజయం సాధిస్తా. నాపై నమ్మకంతో గతంలో ఎంఎల్‌సిగా అవకాశం కల్పించారు. దానికి తగినవిధంగా న్యాయం చేస్తూవస్తున్నాను. ఇప్పుడు మరింత నమ్మకాన్ని పెట్టారు. దీనికి ప్రతిఫలంగా టెక్కలి సీటుని వైసీపీ విజయాల ఖాతాల్లో వేస్తాము. టెక్కలి పరిధిలో మూలపేట పోర్టు, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిరూపిస్తున్నాయి జగన్ మన ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏమిటో చాటిచెబుతున్నాయి.
అన్నివర్గాల అభిమానంతో గెలుస్తా : శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం సమన్వయకర్త పేరాడ తిలక్
అన్ని వర్గాల ప్రజల అభిమానంతో విజయాన్ని సాధిస్తాను. నాపై సీఎం జగన్ ఎంతో నమ్మకాన్ని పెట్టారు. ప్రజలకు మంచిచేసేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఇప్పటికే అందరికీ ఎంతో ప్రేమాభిమానాలు పెరిగాయి. సీఎం జగన్ ని తమ కుటుంబ సభ్యునిగా ప్రజలు భావిస్తున్నారు.