విశాఖపట్నం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు అధ్యక్షతన జిల్లా
అధ్యక్షులు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్లు, పార్టీ జిల్లా స్ధాయి సాంకేతిక
నిపుణులు, బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశం విశాఖపట్నంలో మంగళవారం జరిగింది. ఈ
సమావేశానికి ముఖ్యఅతిధిగా బీజేపీ సాంకేతిక విభాగం జాతీయ ఇన్ఛార్జి, దళిత
మోర్చా జాతీయ అధ్యక్షులు, మాజీ మంత్రి లాల్సింగ్ ఆర్య, బీజేపీ జాతీయ
కార్యదర్శి సునిల్ దేవధర్, రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు, రాష్ట్ర
ప్రధాన కార్యదర్శులు ఎస్. విష్ణువర్ధనరెడ్డి, సూర్యనారాయణరాజు, బిట్రా వెంకట
శివన్నారాయణ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల ప్రకారం
పార్టీ సంస్థాగత బలోపేతానికి మానవ వనరులకు, సాంకేతికతను జోడిరచడం జరుగుతుంది.
అందులో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల వ్యక్తిగత సమాచారం, సభ్యత్వం,
గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల వివరాలను నమోదు చేసేందుకు ఈ సమావేశం
జరిగింది. సమావేశంలో ముఖ్యఅతిదిగా పాల్గొన్న లాల్సింగ్ ఆర్య మాట్లాడుతూ,
ప్రపంచంలోనే అతి పెద్ద సభ్యత్వం కలిగిన భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు
కొత్తగా వస్తున్న సాంకేతికతను కూడా అందిపుచ్చుకుంటోందన్నారు. దేశంలోని 28
రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో మండల, జిల్లా,
రాష్ట్ర, కేంద్రస్ధాయిల్లో ఈ సాంకేతికను అందిపుచ్చుకునేలా చర్యలు
ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. దీని ఆధారంగా పార్టీ కార్యక్రమాలు,
కేంద్రపథకాలను ప్రజలకు చేరువ చేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అనుసంధానం
చేస్తామని, చెప్పారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ సంస్థాగత కార్యక్రమాలు,
ఉద్యమాలకు సాంకేతికతను జోడిస్తామని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు మాట్లాడుతూ రానున్న రోజుల్లో సామాజిక
మాధ్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు, అర్హులైన లబ్దిదారులకు చేరేలా
బీజేపీ సామాజిక మాధ్యమాలను ఉపయోగించాలని సూచించారు. రాష్ట్ర వైఫల్యాలను
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. జాతీయ కార్యదర్శి
సునిల్ దేవధర్ మాట్లాడుతూ, కేంద్రం రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహకారం
అందిస్తున్నా ఎపీలో ప్రాంతీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆవేదన
చెందారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి మొత్తం కేంద్రం చేస్తున్నదే
కనిపిస్తోందని, దీనిని జగన్ ప్రభుత్వం తమ చేతుల్లో ఉన్న ప్రచార సాధనాలతో
తమవిగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రానున్న రోజుల్లో రాష్ట్ర, జిల్లా, మండల స్ధాయిలో
ప్రజాఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పారు. రానున్న 15 నెలల పాటు ప్రతి 15
రోజులకు ఒక కేంద్రమంత్రి రాష్ట్రంలో పర్యటించి కేంద్రం చేస్తున్న సంక్షేమ
కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తామని తెలిపారు.