విజయవాడ : మహోన్నతమైన రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజలకు దశ దిశ నిర్దేశించిన
బాబా సాహెబ్ అంబేద్కర్ చిరస్మణీయులని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్
చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. డాక్టర్ భీమ్రావ్
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఆ మహనీయుని
చిత్రపటానికి పూలమాల వేసి మంగళవారం ఘన నివాళులర్పించారు. అంటరానితనంపై
ఎక్కుపెట్టిన ఆయుధం, కుల దురహంకారంపై గొంతెత్తిన స్వరం డాక్టర్ బీఆర్
అంబేద్కర్ అని మల్లాది విష్ణు కొనియాడారు. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల
కోసం ఆయన చేసిన అలుపెరుగని పోరాటాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా భారతీయుల గుండెల్లో బాబా
సాహెబ్ ఎప్పటికీ నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఆయన ఆలోచనలు
నేటికీ ప్రజలను చైతన్యపరుస్తున్నాయన్నారు. రాబోయే వందేళ్లు సమాజంలోని
మార్పులను ముందే అంచనా వేసి, పరిష్కారాలను ఆనాడే రాజ్యాంగంలో సూచించిన వ్యక్తి
అంబేద్కర్ అని కీర్తించారు. ప్రజాస్వామ్యం ప్రణవిల్లేలా, కోట్లాది మంది పీడిత
ప్రజల ఆశయాలను ప్రతిబింభించేలా రాజ్యాంగానికి రూపకల్పన చేశారన్నారు. ఆయన రాసిన
రాజ్యాంగంలోని ప్రతి పదం ఎంతో విలువైనదని పేర్కొన్నారు. అంబేద్కర్ కృషి
ఫలితంగానే ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం
ఉన్నతవిలువలు కలిగిందంటూ వివరించారు.
అంబేద్కర్ ఆశయ సాధకుడు సీఎం వైఎస్ జగన్ : అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలకు ఆచరణ
రూపం ఇస్తూ కులమతాలు, పార్టీలకతీతంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ
పథకాలు అందిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. విద్యా, వైద్యానికి పెద్ద పీట
వేసి ఆ మహనీయుని ఆకాంక్షలను నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. గత చంద్రబాబు
ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ వ్యవస్థలను నాశనం చేసిందని మల్లాది
విష్ణు అన్నారు. పౌరుల కనీస ప్రాథమిక హక్కులను గత ప్రభుత్వం కాలరాసిందని
గుర్తుచేశారు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తిని
నిలబెడుతూ పాలన సాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. అంబేద్కర్ స్పూర్తితో సమ సమాజ
స్థాపన కోసం, అణగారిన వర్గాల అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ.. ప్రజల
హక్కులను రాజ్యాంగపరంగా కాపాడుతున్నారన్నారు. అందరూ అంబేద్కర్ స్ఫూర్తిని
ఆదర్శంగా తీసుకుని అద్భుత సమాజ నిర్మాణం కోసం పాటు పడాలని మల్లాది విష్ణు
పిలుపునిచ్చారు.