విజయవాడ : దేశంలో సామాజిక న్యాయం నినాదంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
సాధికారత దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్
చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గురువారం 58 వ డివిజన్
259 వ వార్డు సచివాలయ పరిధిలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్
అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
నిర్వహించారు. స్మైల్ ఆస్పత్రి వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించి పి అండ్ టి
కాలనీలో విస్తృతంగా పర్యటించారు. 133 గడపలను సందర్శించి గ్రీవెన్స్
స్వీకరించారు. ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, ఇంకా
ఏవైనా అవసరాలు ఉన్నాయో తెలుసుకునేందుకు చేసే ప్రయత్నమే గడప గడపకు మన ప్రభుత్వం
కార్యక్రమమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. మూడున్నరేళ్లలో అందించిన
సంక్షేమాన్ని ఈ కార్యక్రమం ద్వారా పుస్తక రూపంలో ప్రజల ముందు ఉంచుతున్నట్లు
చెప్పారు. చంద్రబాబు లాగా అబద్దపు వాగ్దానాలతో పేదలను మోసపుచ్చడం తమకు
తెలియదని మల్లాది విష్ణు అన్నారు. అనంతరం స్థానిక సమస్యలపై ఆరా తీశారు.
సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశించారు.
కనీవినీ ఎరుగని రీతిలో మూడున్నరేళ్ల ప్రగతి
తెలుగుదేశం అధికారంలో ఉన్న గత ఐదేళ్లు చేయలేని అభివృద్ధిని.. మూడున్నరేళ్ల
కాలంలో ఈ ప్రభుత్వం చేసి చూపిందని మల్లాది విష్ణు అన్నారు. ఇందులో భాగంగా నేడు
రూ. 5.71 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా రూ.
కోటి 20 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న అర్బన్ హెల్త్ సెంటర్ ను
ప్రారంభించుకుంటున్నట్లు వెల్లడించారు. విజయవాడ – నూజివీడు ప్రధాన రహదారిని
రూ.3.65 కోట్ల వ్యయంతో డస్ట్ ఫ్రీ రోడ్డుగా మార్చేందుకు కండ్రిక జంక్షన్ వద్ద
శంకుస్థాపన నిర్వహించుకున్నట్లు తెలిపారు. ఎల్బీఎస్ నగర్ వద్ద రూ. కోటి
వ్యయంతో కాపు కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకుంటున్నట్లు
మల్లాది విష్ణు పేర్కొన్నారు. అలాగే న్యూ రాజరాజేశ్వరి పేట, వాంబేకాలనీలో
చేతులు మారిన ఇళ్లను నామమాత్రపు రుసుము కేవలం రూ. 100 కే రీ-రిజిస్ట్రేషన్
చేస్తుండటం శుభపరిణామమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే ఏ
నిర్ణయమైనా.. వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చే దిశగా ఉంటుందని ఈ సందర్భంగా
పునరుద్ఘాటించారు. అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడారు. సమాజంలో
సంఖ్యాపరంగా అధికంగా ఉన్నప్పటికీ రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలను
గుర్తించి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని తెలిపారు.
శాసనమండలి సభ్యుల ఎంపిక నిర్ణయమే ఇందుకు చక్కని ఉదాహరణగా చెప్పుకొచ్చారు.