సిక్కోలుకు భారీ కేటాయుంపులు
సాగునీటి ప్రాజెక్టులకు నిధులు
నరసన్నపేట : సామాన్యుల జీవితాల్లో ప్రగతి కాంతులు నింపే సంక్షేమ బడ్జెట్ ను
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ జిల్లా
అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
శ్రీకాకుళం జిల్లాలోని ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టులకు ఈ బడ్జెట్ లో నిధులు
కేటాయించారని తెలిపారు. వంశధార ప్రాజెక్ట్ పనులకు రూ 180.73 కోట్లు,
మహేంద్రతనయపై ఆఫ్ షోర్ ప్రాజెక్టుకు రూ 60.12 కోట్ల నిధులు, ట్రిపుల్ ఐటీకి రూ
130 కోట్లు, అంబేడ్కర్ యూనివర్శిటీ అభివృద్ధికి రూ 7.5 కోట్లు నిధులు
కేటాయించడం ద్వారా శ్రీకాకుళం జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.
ఎప్పటిలాగే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశాలైన విద్య, వైద్యం, వ్యవసాయం కోసం
బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని తెలిపారు. ఎక్కడ విద్యాధికులు
ఉంటారో ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుంటుందని విద్యా రంగానికి రూ.32వేల
కోట్లను ఈ బడ్జెట్ లో కేటాయించారన్నారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో వనరులను
సమకూర్చుకోవడం కోసం ప్రత్యేకంగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్త్రంలోని
అన్ని వర్గాల అభివృద్ధికి దోహదం చేసే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్ష
నాయకులు ప్రవర్తించిన తీరు చాలా బాధకరమని పేర్కొన్నారు. ప్రతిపక్షానికి పసలేక,
ప్రభుత్వాన్ని ప్రశ్నించే దైర్యం లేక అసెంబ్లీ నుండి వెళ్ళిపోయారని తెలిపారు.
తమ నాయకుడు జగన్ ఎజెండా ఒక్కటేనని పెత్తందారి విధానం నుండి పేదవాడికి
సంరక్షించడమే లక్ష్యమని కృష్ణదాస్ పేర్కోన్నారు.