21 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం కేసులో అండమాన్ నికోబార్ దీవుల మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్ ను పోలీసులు అరెస్టు చేశారు. నరైన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ దరఖాస్తును స్థానిక కోర్టు తిరస్కరించడంతో.. పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కోర్టు నిర్ణయం వెలువడిన కొద్దిసేపటికే పోలీసులు ఆయన ఉంటున్న ఓ ప్రైవేటు రిసార్టుకు చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను నేరుగా కోర్టు ఎదుట హాజరుపరిచారు.
అండమాన్ దీవుల్లో సీఎస్ గా పని చేస్తున్న సమయంలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ యువతిని నరైన్ నమ్మబలికాడు. తన అధికారిక నివాసంలో మరో అధికారితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు యువతి ఆరోపించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. యువతి ఫిర్యాదు మేరకు ఆగస్టులో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సీనియర్ ఎస్పీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆయనను చాలా సార్లు విచారించింది.