అధ్యక్షుడు బైడెన్‌ను చంపి అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యమన్న వర్షిత్
కోర్టులో వినయంగా, పొడిపొడిగా సమాధానాలు
ఈ నెల 30 వరకు కస్టడీ…వచ్చే వారానికి విచారణ వాయిదా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు కుట్ర పన్నిన భారత సంతతి యువకుడు సాయి
వర్షిత్ కందుల (19)కు పదేళ్ల జైలు శిక్ష, 2.50 లక్షల డాలర్లు (దాదాపు రూ. 2
కోట్లు) జరిమానా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయివర్షిత్ ఇటీవల ఓ
ట్రక్కుతో వైట్‌హౌస్ బారికేడ్లను ట్రక్కుతో ఢీకొట్టి లోపలికి చొరబడే ప్రయత్నం
చేశాడు. భద్రతాధికారులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అతడిని
ఫెడరల్ కోర్టులో హాజరు పర్చగా ఈ నెల 30 వరకు కస్టడీకి అనుమతినిచ్చింది.
బైడెన్‌ను తొలగించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే తన లక్ష్యమని విచారణలో
సాయి వర్షిత్ పేర్కొన్నాడు. ఆస్తుల విధ్వంసం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం,
అధ్యక్షుడిని చంపుతానని బెదిరించడం, అనుమతి లేకుండా చొరబడడం వంటి పలు
అభియోగాలు వర్షిత్‌పై నమోదయ్యాయి. ఈ నేరాలకు గాను గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు
శిక్ష, రూ. 2 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉందని వర్షిత్‌కు న్యాయమూర్తి
వివరించారు. జడ్జి అడిన ప్రశ్నలకు వర్షిత్ వినయంగా, పొడిపొడి సమాధానాలు
ఇచ్చాడు. అనంతరం వచ్చే వారానికి విచారణను కోర్టు వాయిదా వేసింది.