గుంటూరు : సాహిత్యం సమాజంలో ఒక భాగం కాబట్టి సమాజ సంక్లిష్ట పరిస్థితులను
గమనించాల్సిన బాధ్యత సాహిత్య సంఘాలపై వుందని అన్నారు అరసం జాతీయ కార్యదర్శి
పెనుగొండ లక్ష్మీనారాయణ. స్థానిక బ్రాడీపేటలోని ఎస్ హెచ్ ఓ హాలులో ఆదివారం
నవ్యాంధ్ర రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ,
ప్రత్యేక కవి సమ్మేళనం కార్యక్రమాలు జరిగాయి. నవ్యాంధ్ర రచయితల సంఘం రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా
హాజరైన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ- నేటి కాలమాన పరిస్థితులకు అద్దంపట్టే
కవిత్వం కానీ, కథా సాహిత్యం కానీ వస్తుందా లేదా అని పరిశీలించుకోవాల్సిన అవసరం
సాహితీవేత్తలపై వుందన్నారు. కొత్తగా మత విద్వేషాలను రెచ్చగొట్టే సాహిత్యం కూడా
వస్తుందని, ఆ విషయంలో సాహితీవేత్తలు అప్రమత్తంగా వుండాలన్నారు. సాహిత్య
సంఘాలమధ్య సమన్వయం కోరుకోవడమే సాహితీవేత్తల మొదటి కర్తవ్యమన్నారు. మరో అతిథి
నటులు, రచయిత విడదల సాంబశివరావు మాట్లాడుతూ- ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు
కానీ తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు రచయితలకు మాత్రమే వుంది. రచయితలు పోటీలకు
రచనలు చేయాలి కానీ పోటీల్లో బహుమతి రాకపోతే నిరుత్సాహ పడకూడదన్నారు. పోటీల
కోసం రచనలు చేస్తే రచయిత ప్రతిభ మరింత పెరుగుతుందన్నారు. పోటీల్లో బహుమతుల
కోసమో, ప్రభుత్వ పురస్కారాల కోసమో రచయితలు రచనలు చేయకూడదన్నారు. మరో అతిధి
డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు మాట్లాడుతూ రచయితల సంఘాలు రచయితల
హక్కుల్ని కాపాడేందుకు కృషి చేయాలన్నారు. రచయిత, వైద్యులు డాక్టర్ రమణ యశస్వి
మాట్లాడుతూ రచయితలకు సంఘాలెందుకు వుండాలో, ఆ సంఘాలు రచయితల కోసం ఏం చేయాలో
వివరించారు. నవ్యాంధ్ర రచయితల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి యేమినేని
వెంకటరమణ మాట్లాడుతూ సాహిత్య సంఘాలకు గానీ, సాహిత్య పత్రికలకు గానీ చేయూత ఎంతో
అవసరం. ఆ చేయూత మన నుండే మొదలవ్వాలని చెబుతూ నూతనంగా ఏర్పడిన జిల్లా శాఖకు
తనవంతుగా రు.5,116 విరాళంగా అందించారు. కార్యక్రమంలో రచయిత్రులు పోగుల
విజయశ్రీ, సిహెచ్ సుశీలమ్మ మాట్లాడారు. సినీ గేయ రచయిత వేటూరి జయంతి, గాంధీ
వర్థంతిని పురస్కరించుకుని ప్రత్యేక కవి సమ్మేళనం జరిగింది. విజయ గోలి
నిర్వహించిన ఈ కవి సమ్మేళనంలో మన్నం వెంకట గురువు, బూదాటి భానోజీబాబు, పి.
శివశంకరరావు, పింగళి భాగ్యలక్ష్మి, పి.వి. రమణకుమార్, రేపల్లె రాజ్ కృష్ణ, ఎం.
వెంకట రఘునాథరావు, బాపయ్య చౌదరి పాల్గొన్నారు. గుంటూరుజిల్లా శాఖ అధ్యక్షులుగా
డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్, కార్యదర్శిగా సయ్యద్ జానీ బాష,
ఉపాధ్యక్షులుగా కాకరపర్తి సుబ్రహ్మణ్యం, కార్యవర్గ సభ్యులుగా విజయ గోలి,
విష్ణుమొలకల భీమేశ్వరప్రసాద్, ఆళ్ళ నాగేశ్వరరావు, కారంచేటి విజయకుమార్, కోట
లీలాకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధిగా బండికల్లు జమదగ్ని బాధ్యతల్ని
స్వీకరించారు.