సికింద్రాబాద్ నుంచి ‘వందే భారత్’ ఎక్స్ప్రెస్ తొలికూత
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు ప్రారంభమైంది. ప్రజలు
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తొలి సెమీ హైస్పీడ్ వందేభారత్
ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడిచే ఈ
రైలును ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా
ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ప్రారంభోత్సవ
కార్యక్రమంలో అశ్వినీ వైష్ణవ్, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, పర్యాటకశాఖ
మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్
యాదవ్ పాల్గొన్నారు.
నవభారత సంకల్పం, సామర్థ్యానికి వందేభారత్ రైలు ప్రతీక అని ప్రధాని నరేంద్ర
మోడీ స్పష్టంచేశారు. ఇతరులపై ఆధారపడే మనస్తత్వం నుంచి బయటపడి స్వలంభన దిశగా
సాగుతున్న ఆత్మనిర్భర భారతావనికి నిదర్శనమని తెలిపారు. తెలుగుప్రజలకు పండుగ
కానుక వందేభారత్ రైలు అని అన్నారు. వందేభారత్తో తెలుగు ప్రజల మధ్య వేగంతమైన
ప్రయాణం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజలను ప్రగతిలో భాగస్వామ్యులను చేసే
కార్యక్రమం కొనసాగుతోందని, ఇందుకు వందేభారత్ ఒక సాక్ష్యమని తెలిపారు. 8ఏళ్ల
క్రితం వరకు భారతీయ రైల్వే అంటే నిరాశే కనిపించేదని, అసాధ్యమనుకున్న మార్పులను
చేసి చూపించామని ప్రధాని వెల్లడించారు.
వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ
‘‘పండగ వాతావరణంలో తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ గొప్ప కానుక. తెలుగు ప్రజలకు
వందేభారత్ ఎక్స్ప్రెస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రైలు ద్వారా రెండు
తెలుగు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి దోహదపడుతుంది. హైదరాబాద్-
వరంగల్ – విజయవాడ – విశాఖ నగరాలను అనుసంధానిస్తూ ప్రయాణం సాగుతుంది.
సికింద్రాబాద్ – విశాఖ మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది.” అని అన్నారు.
“వందే భారత్ పూర్తిగా దేశీయంగా తయారైంది. పూర్తి దేశీయంగా తయారైన వందేభారత్తో
బహుళ ప్రయోజనాలున్నాయి. అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తుంది. భద్రతతో
పాటు రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. 2023లో ప్రారంభిస్తున్న తొలి
వందేభారత్ రైలు ఇది. మారుతున్న దేశ భవిష్యత్తుకు ఇదొక ఉదాహరణ. గడచిన 8ఏళ్లలో
తెలుగురాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధికి ఎంతో చేశాం. కొత్త రైల్వేలైన్లతో పాటు
విద్యుద్దీకరణను వేగవంతంగా పూర్తిచేస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
పేర్కొన్నారు.
సీసీటీవీ కెమెరాలు, రీడింగ్ లైట్లు, అత్యవసర పరిస్థితుల్లో రైల్ సిబ్బందితో
మాట్లాడేందుకు ప్రత్యేకంగా అలారం బటన్ ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి ప్రతిరోజూ
ఉదయం 5.45కి వందే భారత్ రైలు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాలకు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం
3 గంటలకు ప్రారంభమై రాత్రి పదకొండున్నరకి విశాఖపట్నానికి చేరుకుంటుంది. ఈ
వందేభారత్ రైలు గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని దక్షిణ మధ్య రైల్వే
సికింద్రాబాద్-విజయవాడ మధ్య 350కిలోమీటర్ల దూరాన్ని 4గంటల్లో చేరుకుంటుందని,
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ఎనిమిదిన్నర గంటల్లో చేరుకుంటుందని రైల్వే
అధికారులు వెల్లడించారు.