ఇందులో కేవలం ఏడుగురే కొత్త వారు
ఇచ్చిన మాట ప్రకారం సిట్టింగులకే టికెట్
అంచనాలకు అందని కేసీఆర్ చాణక్యం
హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మరోసారి సిట్టింగులకు సింహభాగం
సీట్లు కేటాయించారు. గత ఒవరడిని కొనసాగిస్తూ సోమవారం ఒకేసారి 115 మంది
అభ్యర్థులను ప్రకటించారు. 108 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి
కేసీఆర్ చాణక్యం ప్రదర్శించారు. అభ్యర్థుల జాబితాలో కేవలం ఏడుగురే కొత్తవారు.
పలు స్థానాల్లో అభ్యర్థులను మారుస్తారని, వారసులకు అవకాశం కల్పిస్తారని
ప్రచారం జరిగినా.. మరోసారి సిట్టింగులకే చాన్స్ ఇచ్చి అందరినీ
ఆశ్చర్యపరిచారు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, సర్వేల్లో ప్రజల మద్దతును ఆధారంగా
చేసుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేలనే మరోసారి ఎన్నికల బరిలో దింపారు. ఆసిఫాబాద్,
ఖానాపూర్, బోథ్, కామారెడ్డి, కోరుట్ల, వేములవాడ, ఉప్పల్,
స్టేషన్‌ఘన్‌పూర్, వైరా స్థానాల్లో కొత్తవారికి అవకాశం కల్పించారు. వీటిలో
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్, కోరుట్ల నుంచి ఎమ్మెల్యే కల్వకుంట్ల
విద్యాసాగర్‌రావు కుమారుడు డాక్టర్ సంజయ్‌కుమార్ బరిలో ఉండనున్నారు.
కంటోన్మెంట్ సీటు ప్రస్తుతం ఖాళీగా ఉండగా, దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు
లాస్యనందితకు ఇక్కడ చాన్స్ ఇచ్చారు.
గతంలోనూ ఇదే ఫార్ములా : 2018లోను ఇదే ఫార్మూలాను అనుసరించిన కేసీఆర్ ఆ
ఎన్నికల్లో చారిత్మాత్మక విజయాన్ని అందిపుచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లోను
సిట్టింగ్‌లకే సీట్లు కేటాయిస్తామని మొదటి నుంచి ప్రకటిస్తూ వచ్చారు.
సిట్టింగులే తమ గెలుపు గుర్రాలని పలుమార్లు ప్రకటించారు. సర్వేల్లోనూ
సానుకూలంగా ఉన్నట్టు వెల్లడించారు. అయినా, సిట్టింగ్‌లను మార్చవచ్చన్న
పుకార్లు షికార్లు చేశాయి. పార్టీ మొదటి అభ్యర్థుల జాబితా ప్రకటనతో అదంతా ఉత్త
ప్రచారమేని తేలిపోయింది.