దేనికైనా సిద్ధం అంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. జగన్ ఈ నెల 27 నుంచి పార్టీ క్యాడర్ తో నిర్వహించే ప్రాంతీయ స్థాయి సదస్సులకు సిద్ధం అన్న పేరుని వైసీపీ పెట్టింది. విశాఖ నిండా ఇపుడు జగన్ ఫోటోతో సిద్ధం ఫ్లెక్సీలు పోస్టర్లు వెలిశాయి. సిద్ధంలోనే యుద్ధం ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి రణభేరీ మోగించి విజయం సాధిస్తామని అంటున్నారు. సిద్ధం అంటే దేనికైనా రెడీ అని చెబుతున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి పాజిటివ్ వేవ్ ఉందని అందుకే తాము ధీమాగా ఉన్నామని సిద్ధం అని చెబుతున్నామని వైసీపీ నేతలు అంటున్నారు.
ఉత్తరాంధ్రా నుంచి జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. మొత్తం పార్టీని జోరెత్తించేలా జగన్ దిశా నిర్దేశం చేస్తారని చెబుతున్నారు. సిద్ధం సభతో వైసీపీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అయినట్లే అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రాలోని ముప్పయి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ క్యాడర్ సిద్ధం సభకు అటెండ్ అవుతుంది. రెండు లక్షల మందికి తక్కువ కాకుండా క్యాడర్ తో నిర్వహించే ఈ సభ ఒక రికార్డు అని అంటున్నారు. నేరుగా క్యాడర్ తో సీఎం మమేకం కావడమే కాదు, వారికి పార్టీ లైన్ ఏంటో చెబుతారు. అలాగే విపక్షాలు ఏమి విమర్శలు చేస్తున్నాయో చెప్పి దానిని ధీటుగా ఎలా ఎదుర్కోవాలో కూడా చెబుతారు అని అంటున్నారు. సిద్ధం సభ మాత్రం వైసీపీ రాజకీయానికి మేలి మలుపు గా నిలుస్తుంది అని అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధం సభ ఏర్పాట్లు అన్నీ భీమిలీ నియోజకవర్గంలో చురుకుగా సాగుతున్నాయి. ఈ సభ అనంతరం వైసీపీ ఎన్నికల నినాదం ఏంటి అన్నది కూడా తెలుస్తుంది. యాక్షన్ ప్లాన్ కూడా బయటకు వస్తుందని అంటున్నారు.