అమరావతి : సీఎం జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు సీఎం వైఎస్ జగన్ జమ చేయనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కింద బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.