హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ థాకరే స్థాపించిన శివసేన పార్టీని ముఖ్యమంత్రి
పదవి కోసం శరద్ పవార్ కాళ్లకింద పెట్టారంటూ ఉద్ధవ్ థాకరేపై కేంద్ర మంత్రి
అమిత్ షా మండిపడ్డారు. పార్టీ సిద్ధాంతాలను, కార్యకర్తల మనోభావాలను
పట్టించుకోకుండా అధికారదాహంతో ప్రవర్తించారని విమర్శించారు. ఇంత చేసినా ఆ పదవి
కూడా మూణ్నాళ్ల ముచ్చటే అయ్యిందని అమిత్ షా ఎద్దేవా చేశారు. మోసం చేసి
కొంతకాలం పాటు పదవిని, పవర్ ను దక్కించుకోవచ్చు కానీ యుద్ధరంగంలో నిలబడి
గెలవాలంటే గుండెధైర్యం కావాలని షా ఎద్దేవా చేశారు. ఈమేరకు కొల్హాపూర్ లో
బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం
మాట్లాడారు. ఉద్ధవ్ థాకరే పొత్తు ధర్మాన్ని విస్మరించాడని ఆరోపించారు.
బీజేపీతో కలిసి 2019 ఎన్నికలకు వెళ్లిన థాకరే ఫలితాల తర్వాత అధికారదాహంతో
ప్రవర్తించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీ సిద్ధాంతాలకు
తిలోదకాలిచ్చారని చెప్పారు. బాలాసాహెబ్ థాకరే ఏ పార్టీలకైతే వ్యతిరేకంగా
శివసేనను తీర్చిదిద్దారో వాటితోనే అంటకాగి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడని
విమర్శించారు. మోసంతో దక్కించుకున్న పదవిలో ఎక్కువ కాలం కూర్చోలేకపోయాడని షా
చెప్పారు. మోసంతో వచ్చే గెలుపు తాత్కాలికంగానే ఉంటుందని వివరించారు. గత
ఎన్నికల్లో బీజేపీ కూటమికి రాష్ట్రంలో 42 సీట్లు వచ్చాయని, ఈసారి మొత్తం 48
లోక్ సభ స్థానాలనూ కైవసం చేసుకోవాలని, ఆ దిశగా ప్రతీ ఒక్కరూ కష్టపడి
పనిచేయాలని కార్యకర్తలకు అమిత్ షా పిలుపునిచ్చారు.