ఒకే రోజున 1.90 లక్షల మొక్కలు, 126 చెట్లను నాటిన హెచ్ఎండిఏ
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు హరితహారం స్ఫూర్తితోనే
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఎన్నో జాతీయ,
అంతర్జాతీయ గ్రీనరీ అవార్డులను సాధించిందని మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి
శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మెట్రో పాలిటన్ కమిషనర్ అర్విoద్ కుమార్
అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం శంషాబాద్
విమానాశ్రయం నుంచి నేరుగా కొత్వాల్ గూడ ఎకో పార్క్ కు చేరుకుని దాదాపు 15
అడుగుల ఎత్తైన మర్రిచెట్టును కొత్వాల్ గూడ ప్రాంగణంలో నాటారు. బాచుపల్లి
మల్లంపేట్ రోడ్డు విస్తరణలో 126 మర్రి, రావి జాతులకు సంబంధించిన చెట్లను
హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ యంత్రాంగం కొత్వాల్ గూడ ఎకో పార్క్ లో ట్రాన్స్
లోకేషన్ చేస్తున్నాయి. దాదాపు 200 మందికి పైగా హెచ్ఎండీఏ, హెచ్.జి.సి.ఎల్
ఉద్యోగులు, సిబ్బంది సోమవారం కొత్వాల్ గూడ ఎకో పార్క్ లో 15,000 మొక్కలు
నాటారు.
మహేశ్వరం మండలం పరిధిలోని ఎలిమినేడు ఫారెస్ట్ అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ లో
హెచ్ఎండిఏ సిబ్బంది సోమవారం 25,000 మొక్కలు నాటారు.
ఔటర్ రింగ్
రోడ్డు(ఓఅర్అర్) పరిసర ప్రాంతాలు, జంట నగరాలలో 30 కేంద్రాల్లో ఏడుగురు(7)
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు(ఎఫ్ఆర్ఓ)లు మొబైల్ వాహనాల ద్వారా 1,50,000 మొక్కలను
వృక్ష ప్రసాదం (ఉచిత పంపిణీ) చేశారు. మొత్తంగా సోమవారం ఒక్క రోజున హెచ్ఎండిఏ
అర్బన్ ఫారెస్ట్ యంత్రాంగం ఆధ్వర్యంలో 1,90,000 మొక్కలు, 126 మర్రి జాతుల
చెట్లను నాటి రికార్డు సాధించారు. కొత్వాల్ గూడ ఎకో పార్క్ లో హైదరాబాద్
గ్రోత్ కారిడార్ మేనేజింగ్ డైరెక్టర్ బిఎల్ఎన్ రెడ్డి, అర్బన్ ఫారెస్ట్
డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్, హెచ్ఎండిఏ సెక్రెటరీ చంద్రయ్య, ప్లానింగ్
డైరెక్టర్ శివ శరణప్ప, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ విజయలక్ష్మి, ల్యాండ్ ఎక్విజేషన్
ఆఫీసర్ ప్రసూనాంబ లతోపాటు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది
పాల్గొన్నారు.