హైదరాబాద్ : భారాస పాలనలో ప్రజాధనం దుర్వినియోగమైందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సచివాలయంలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలోని ఒక్కో ప్రాజెక్టుపై సమీక్ష చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ, ఇతర సాగునీటి ప్రాజెక్టు పనుల వేగవంతంపై చర్చించాం. అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరిగినట్లుగానే ఇందులోనూ భారీ కుంభకోణం జరిగింది. ప్రాజెక్టుల పేరిట భారీ మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం జరిగింది. ఈ ప్రాజెక్టు గతంలో రాజీవ్ దుమ్ముగూడ, ఇందిరాసాగర్ అని రెండు వేర్వేరుగా ఉండేవి. ఆ రెండింటినీ ఏ విధంగా ఒక్కటి చేసి సీతారామ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారో తెలియడం లేదు. దీనిపై రూ.వేల కోట్లు ఖర్చు చేశారు. గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న కేసీఆర్ సైతం సీతారామ ప్రాజెక్టుపై అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. 2014లో భారాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి మరో రూ.1400 కోట్ల నుంచి రూ.1500 కోట్లు ఖర్చే చేసి ఉంటే దుమ్ముగూడ, ఇందిరాసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు ఏడాదిలో పూర్తయ్యేవి. 3,32,000 ఎకరాలకు నీరు వచ్చేది. పదేళ్లు దాటింది. మరో రూ.7,500 కోట్లు ఖర్చు చేశారు. ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదు. సీతారామ ప్రాజెక్టు వ్యయం పెంచి రూ.18వేల కోట్లకు తీసుకొచ్చారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి మీడియాకు వివరించారు.
రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రజల సహకారం కావాలి : భట్టి విక్రమార్క
భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే నీటి కోసం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి డిజైన్ చేసిన రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు వ్యయం రూ.1,681 కోట్లు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికే రూ.889 కోట్లు ఖర్చు చేశారు. ఇందిరాసాగర్ మొత్తం వ్యయం రూ.1,824 కోట్లు. ఉమ్మడి రాష్ట్రంలో దీనిపై ఖర్చు చేసింది రూ. 1,064 కోట్లు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఇంకా ఖర్చు చేయాల్సింది కేవలం రూ.1,552 కోట్లు మాత్రమే. ఇది పట్టించుకోకుండా రీడిజైన్ పేరుతో కొత్తవి తీసుకొచ్చారు. దీనికి అదనంగా సీతమ్మ సాగర్ బ్యారేజీ అని ప్రారంభించారు. దాని వ్యయం రూ. 4,481 కోట్లు. అంటే.. కేవలం రూ.1,581 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుల వ్యయాన్ని రూ.22,981 కోట్లకు పెంచారు. వీటి కోసం టన్నెల్ అన్నారు. దాని పరిస్థితి ఏంటో తెలియడం లేదు. ఇంత దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రజల సహకారం కావాలని అన్నారు.