న్యూఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి
సిసోదియాను అయిదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీ లోని సీబీఐ
ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు సీబీఐ చేసిన విజ్ఞప్తికి
కోర్టు అంగీకారం తెలిపింది. మద్యం విధాన రూపకల్పన ప్రభుత్వ నిర్ణయమని,
వ్యక్తిగతంగా కుట్ర చేసేందుకు అవకాశమే లేదని సిసోదియా తరఫు న్యాయవాది కోర్టుకు
తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేనందున సీబీఐ దాఖలు చేసిన
రిమాండు అభ్యర్థనను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ప్రత్యేక
న్యాయమూర్తి తొలుత విచారణను వాయిదా వేశారు. అనంతరం మార్చి 4 వరకు సిసోదియాను
కస్టడీలోకి తీసుకోవడానికి సీబీఐకి అనుమతినిస్తూ సాయంత్రానికి నిర్ణయాన్ని
వెలువరించారు. అంతకుముందు సిసోదియాను భారీ భద్రత నడుమ అధికారులు కోర్టుకు
తీసుకొచ్చారు. విచారణ జరిగిన రౌస్ ఎవెన్యూ కోర్టు కాంప్లెక్స్ వద్ద పోలీసులు
భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం కోర్టులో సుమారు గంటన్నరకు పైగా
వాడీవేడి వాదనలు జరిగాయి. మద్యం విధానం సవరణకు ఆమోదముద్ర వేసింది లెఫ్టినెంట్
గవర్నర్ (ఎల్జీ) అని, కానీ సీబీఐ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వెనక పడుతోందని
సిసోదియా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
మద్యం పాలసీని అనేక సంప్రదింపుల అనంతరం రూపొందించారని, ఎల్జీ నుంచి సైతం
సలహాలు తీసుకునే నూతన విధానాన్ని తయారుచేశారని తెలిపారు. ఇందులో అవకతవకలకు
అవకాశమే లేదని వాదించారు. బడ్జెట్ సమర్పించాల్సిన ఈ సమయంలో ఒక ఆర్థికమంత్రిని
అరెస్టు చేయడం ఒక వ్యక్తిపై కాక వ్యవస్థపైన జరిగిన దాడిగా పేర్కొన్నారు.
ముద్దాయి పలుమార్లు సెల్ఫోన్లు మార్చారని సీబీఐ ఆరోపిస్తోందని అదేం నేరం కాదు
కదా అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో తాము దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో సిసోదియాను
ఏ1 నిందితుడిగా పేర్కొన్నట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. మద్యం విధానం కోసం
రూపొందించిన డ్రాఫ్ట్ నోటీసుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలను సిసోదియా
తొలగించారని ఆరోపించింది. ఆయన తమ ప్రశ్నలకు ఎగవేత ధోరణిలో సమాధానాలు
ఇస్తున్నారని పేర్కొంది.