విశాఖపట్నం : అవినాష్ రెడ్డి హైడ్రామాపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు
కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినాష్
రెడ్డి అరెస్ట్ ఎప్పుడన్నదానిపై ఉత్కంఠ దేనికి? అని ప్రశ్నించారు. సీబీఐ
చేతకాని సంస్థ అనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు. సీబీఐ నిర్ణయించుకుంటే
ఎవరు వచ్చినా, ఏ స్థాయికి వెళ్లైనా సరే అరెస్ట్ చేస్తారని చెప్పుకొచ్చారు.
ఫ్యాక్షనిజం ఒత్తిళ్లకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆగబోవు.. లొంగవు అని
తెలిపారు. సీబీఐ నిర్ణయం తీసుకునేంత వరకూ ఓపిక పట్టాల్సిందే.. సీబీఐ ని ఏ
శక్తీ ఆపలేదంటూ తేల్చిచెప్పారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రారంభం
అవుతుందని తెలిపారు. ఈ భవనంతో భారతదేశానికి ఒక గుర్తింపు రాబోతోందని
చెప్పుకొచ్చారు. చారిత్రాత్మక సమయంలో ప్రతిపక్ష పార్టీలు బాయ్ కాట్ చేయడం
దురదృష్టకరం..దుర్మార్గం అన్నారు. ఆయా రాజకీయ పార్టీలు తప్పు తెలుసుకోకపోతే
చరిత్ర హీనులుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ 9 ఏళ్లు పూర్తి
చేసుకోబోతున్న తరుణంలో ఈనెల 30న దేశ ప్రజలతో మాట్లాడతారని వెల్లడించారు. 11
స్థానం నుంచీ 6వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని వివరించారు.
త్వరలో మూడో అతి పెద్ద వ్యవస్థగా మారుతుందని జోస్యం చెప్పారు. కేంద్ర నుంచీ
ఆర్థిక సహాయం అత్యధికంగా లబ్దిపొందిన రాష్ట్రం ఏపీయేనని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కు రెండ్రోజుల క్రితమే రూ.10,400 కోట్లు రెవెన్యూ డెఫిసిట్
గ్రాంట్ నిధుల రూపంలో ఇచ్చినట్లు తెలిపారు. మూడున్నర ఏళ్లలో ప్రత్యేక హోదా
ఇచ్చి ఉంటే ఇంత ప్రయోజనం జరిగేదా? దానికి మంచిన సహాయం అందిందని
చెప్పుకొచ్చారు. నిధులు ఎందుకు ఇచ్చారన్న విచిత్ర ప్రశ్నలు కొంతమంది
వేస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిధులు రాష్ట్ర ప్రజలకు ఇచ్చాం.
అంతేకానీ రాజకీయ కోణంతో నిధులు ఎవరూ ఇవ్వరని తెలిపారు. ఏపీకి రావాల్సిన మిగతా
నిధులు ఆపేస్తారన్న వదంతులు పుట్టిస్తున్నారని విమర్శించారు. ఏపీకి నిధులు
ఇస్తుంటే అనవసర నిందలు కేంద్రంపై వేయడం సరికాదని ఆయన హితవు పలికారు.