విజయవాడ : దేశ మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని ‘సుపరిపాలన దినోత్సవం’గా జరుపుకోవడం అనుసరణీయమని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ‘సుపరిపాలన దినోత్సవం’ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు. మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందిస్తూ, ప్రజలకు అవగాహన కల్పించడానికి ‘సుపరిపాలన దినోత్సవం’ జరుపు కుంటున్నామన్నారు. సమాజంలో అవినీతికి చోటు లేదని, ప్రతి ఒక్కరూ ఆనందం, గౌరవం, సమాన అవకాశాలతో జీవించే హక్కు ఉందన్న విషయాన్ని ఈ రోజు మనకు గుర్తు చేస్తుందన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.