విజయవాడ : సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టి లక్ష్య
సాధన ద్వారా రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చే భాధ్యత
అధికారులపై ఉందని రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి జిఎస్ఆర్ఆర్.విజయ్ కుమార్
అన్నారు. విజయవాడ తుమ్మల పల్లి కళాక్షేత్రంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన
స్పందనపై గురువారం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అధికారులతో నిర్వహించిన అవగాహన
సదస్సుకు రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి జిఎస్ఆర్ఆర్ విజయ్ కుమార్ ముఖ్య
అతిధిగా హాజరై జ్వోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం విజయ్
కుమార్ మాట్లాడుతూ మానవ జాతి అభివృద్ధి కోసం ప్రపంచ దేశాలు ఏకమై
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. 2000
సంవత్సరంలో 15 సంవత్సరాల కాల పరిమితితో 8 అంశాలలో సుస్థిరమైన అభివృద్ధి సాధన
జరగాలని నిర్ధేశించారన్నారు. రాష్ట్రంలో 17 సుస్థిరాభివృద్ధి సూచీలను
ప్రధాన్యతలుగా తీసుకుని 2030 నాటికి నూరు శాతం లక్ష్యాలను సాధించాలని
నిర్ణయించడం జరిగిందన్నారు. పేదరిక నిర్మూలన, ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణ,
నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, సురక్షితమైన నీరు, పరిశుభ్రత, అసమానతల
తొలగింపు, ఉపాధి, ఆర్థికాభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన,
శాంతి, న్యాయవ్యవస్థలు, వాతావారణ పరిరక్షణ తదితర అంశాలు ఉన్నాయన్నారు. ఆయా
అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అమలు పరచడం భాధ్యతగా
స్వీకరించాలన్నారు. ప్రణాళికాబద్దంగా కృషి చేస్తే లక్ష్యాల సాధన సులువు
అవుతుందన్నారు. పేదరికం నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తే సుస్థిరాభివృద్ధి
సాధనలో రాష్ట్రాన్ని అగ్రగామిగ నిలపగలుగుతామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న
సంక్షేమ పథకాలు సుస్థిరాభివృద్ధికి దగ్గరగా ఉన్నాయన్నారు. పథకాలను సక్రమంగా
అమలు చేయడం ద్వారా లక్ష్యాలను చేరుకోగలమన్నారు. ప్రభుత్వం వేలాది కోట్ల
రూపాయలు ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తుందన్నారు. మహిళలు, గర్భిణీ స్త్రీలు,
బాలికలు రక్తహీనత వలన శారీరక సమస్యలు, ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారన్నారు.
బాల్య దశ నుండే బాలికలలో రక్తహీనత లేకుండా చేయగలిగితే ఆనందమైన జీవితాన్ని
గడపడంతో పాటు వివాహనంతరం ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు మాట్లాడుతూ మానవీయ విలువలు, సామాజిక అంశాలను
దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి అవసరమైన చర్యలు
తీసుకుంటున్నామన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై పూర్తి అవగాహన కలిగి వాటి
ప్రాముఖ్యతను తెలుసుకుని గ్రామ వార్డు స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు
క్షేత్రస్థాయిలో ఎటువంటి లోపాలు లేకుండా అమలు చేసేలా అధికారులు ప్రత్యేక
దృష్టి పెట్టాల్సిన అవసరం వుందన్నారు. జిల్లా స్థాయిలో అమలు చేస్తున్న పథకాలలో
61 సూచీకలను అధికారులు భాధ్యతగా పర్యవేక్షించాలన్నారు. రోజు వారి విధులతో పాటు
ఎజి లక్ష్యాల సూచీకల అమలును పర్యవేక్షించి సంబంధించిన పురోగతి సమాచారాన్ని
తప్పకుండా అన్లైన్లో నమోదు చేయాలన్నారు.