సీఎం వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈనెల 21న అందజేత
రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
విజయవాడ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఆదర్శనీయమని రాష్ట్ర ప్లానింగ్
బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సీఎం వైఎస్
జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 8వ
తరగతి విద్యార్థినీ విద్యార్థులకు ట్యాబ్ లను ఉచితంగా అందజేస్తుండటం
హర్షణీయమన్నారు. నియోజకవర్గంలోని 15 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 1,655 మంది
విద్యార్థులకు, 140 మంది ఉపాధ్యాయులకు రూ. 2 కోట్ల 38 లక్షల 16 వేల 60 విలువైన
ట్యాబ్ లను పంపిణీ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలియజేశారు. అత్యున్నత
ప్రమాణాలతో కూడిన డిజిటల్ పాఠ్యాంశాలను ఇందులో పొందుపర్చడం జరుగుతుందని
మల్లాది విష్ణు వెల్లడించారు. ఒక్కో విద్యార్థికి రూ. 15 వేలు విలువ చేసే
ట్యాబ్ తో పాటుగా మరో రూ. 15 వేలు విలువ చేసే బైజూస్ కంటెంట్ తో కలిపి
అందించనున్నట్లు తెలియజేశారు. మూడేళ్ల తర్వాత సీబీఎస్ఈ విధానంలో టెన్త్
పబ్లిక్ పరీక్షలకు ఆంగ్ల మాధ్యమంలో హాజరయ్యే విద్యార్థులకు ఇవి ఎంతగానో
దోహదపడతాయన్నారు. విప్లవాత్మక సంస్కరణలతో పాఠశాల విద్య పటిష్టతకు రాష్ట్ర
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతి ఆయోగ్ సైతం కీర్తించడం జరిగిందని మల్లాది
విష్ణు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను స్ఫూర్తిగా
తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు సూచించడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వానికి ప్రతిఒక్కరూ అండగా నిలవాలని ఈ సందర్భంగా మల్లాది విష్ణు కోరారు.