న్యూఢిల్లీ : పేదల సొంతింటి కల నెరవేరేలా బడ్జెట్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన
నిధులను భారీగా పెంచింది కేంద్రం. రూ.79వేల కోట్లు ఇందుకోసం కేటాయిస్తున్నట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పనకు
పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు.
ఇళ్లు లేని వారికి కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్ చెప్పింది. కేంద్ర బడ్జెట్లో
ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను భారీగా పెంచింది. గతంలో కంటే 66 శాతం నిధులను
పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తాజా
బడ్జెట్లో రూ.79వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో దేశంలో
మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. వరుసగా మూడో
ఏడాది భారీగా నిధులను కేటాయించింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.10 లక్షల
కోట్లను వెచ్చించనున్నట్లు కేంద్ర విత్త మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఇది
జీడీపీలో 3.3 శాతమని చెప్పారు. 2020లో చేసిన కేటాయింపులతో పోలిస్తే ఇది మూడు
రెట్లు అధికమని వివరించారు.దీంతో పాటు పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు
కట్టుబడి ఉన్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా అర్బన్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఉన్న గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి తరహాలోనే దీన్ని జాతీయ
హౌసింగ్ బ్యాంక్ నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. ప్రాంతీయ కనెక్టివిటీని
మెరుగుపర్చేందుకు 50 అదనపు ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్లు, వాటర్ ఏరో డ్రోన్లు,
అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు.
రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయించారు. 2013-14 తర్వాత రైల్వేలకు ఇవే
అత్యధిక కేటాయింపులు అని సీతారామన్ తెలిపారు.
ఏడు అంశాలకు ప్రాధాన్యం
తాజా బడ్జెట్ విషయంలో సప్త సూత్రాల మంత్రాన్ని పఠించింది కేంద్రం. అమృత కాలంలో
ఆర్థిక సాధికారత సాధించేందుకు ఏడు అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపింది.
సమ్మిళిత వృద్ధి, చివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు, మౌలిక వసతులు-
పెట్టుబడులు, హరిత అభివృద్ధి, సామర్థ్యాల వెలికితీత, యువ శక్తి, ఆర్థిక
రంగానికి పెద్ద పీట వేస్తున్నట్లు స్పష్టం చేసింది. అందించడం సహా వ్యవసాయం
కోసం డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపర్చనున్నట్లు నిర్మలా సీతారామన్
వెల్లడించారు. జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ కింద రూ.141.4లక్షల కోట్లతో
చేపట్టిన 89,151 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.