గుంటూరు : రాష్ట్ర మంత్రివర్గం పలు పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో సచివాలయంలో సమావేశమైన కేబినెట్ ఎన్టీపీసీ
ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు ఆమోదం
తెలిపింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో వెయ్యి మెగావాట్ల
చొప్పున ఎకోరెన్ ఎనర్జీ ఇండియా సంస్థ ఏర్పాటు చేయనున్న పవన, సౌర విద్యుత్
ప్రాజెక్ట్‌లకూ పచ్చజెండా వూపింది. ఇక విశాఖలో టెక్ పార్కు ఏర్పాటుకు 60 ఎకరాల
కేటాయింపునకు ఆమోదం తెలిపారని తెలుస్తోంది.
గుంటూరు జిల్లా అమరావతిలో ఉన్న సచివాలయంలో సీఎం నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ
సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఎన్టీపీసీ
ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద కొత్తగా ఎనర్జీ పార్కు ఏర్పాటుకు
కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడతలో 55 వేల కోట్లు, రెండో విడతలో
55వేల కోట్లు పెట్టుబడితో ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. మొత్తంగా రూ.1,10,000
కోట్ల పెట్టుబడితో ఎన్టీపిసి ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేసింది. మొదటి ఫేజ్‌లో 30
వేల మందికి, రెండవ ఫేజ్‌లో 31వేల మందికి మొత్తంగా 61వేల మందికి ఉద్యోగావకాశాలు
రానున్నట్లు పేర్కొంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో
విండ్, సోలార్ పవర్ ప్రాజెక్ట్‌లకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. 1000
మెగావాట్ల విండ్, 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లను ఎకోరెన్ ఎనర్జీ ఇండియా
ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. నాలుగు విడతల్లో మొత్తంగా
10,500 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా 2 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు
పేర్కొంది. వైజాగ్ టెక్ పార్కుకు 60 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 100
మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త పాలసీలో
భాగంగా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
బందరు పోర్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 9.75 శాతం వడ్డీతో 3940
కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నెల్లూరు బ్యారేజీకి
నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా పేరు మార్చాలని కేబినెట్
నిర్ణయించింది. గ్రానైట్ కంపెనీలకు విద్యుత్ రాయితీలకు కెబినెట్ అంగీకారం
తెలిపింది. యూనిట్‌కు 2 రూపాయల చొప్పున వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
వైద్యారోగ్య శాఖలో రిక్రూట్మెంట్లకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు కేబినెట్
నిర్ణయం తీసుకుంది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్టు ఏర్పాటుకు
పచ్చజెండా ఊపింది. వర్శిటీల్లోని నాన్ టీచింగ్ స్టాఫ్ విరమణ వయస్సు 62 ఏళ్ల
పెంపును ఆమోదించి ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. జేఎస్‌డబ్ల్యూ
ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు రామాయపట్నం పోర్టులో 2 క్యాప్టివ్ బెర్తులను
నామినేషన్ పద్ధతిలో కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.