విలేకరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి
11న జాతీయ స్విమ్మింగ్ పూల్ డే నేపథ్యంలో యోగా జలాసనాలు వేసిన స్వామి
విజయనగరం : సోషల్ మీడియా దుష్ప్రభావాలను క్రీడలపై, ముఖ్యంగా
పిల్లలపై పడకుండా జాగురూకత వహించాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
వీరభద్ర స్వామి హెచ్చరించారు. పిల్లల్లో క్రీడలపై ఆసక్తి పెంచి తగిన
ప్రోత్సాహం అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. వయసుతో
సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉన్న స్విమ్మింగ్ క్రీడ అని..
దాని ఆవశ్యకతను అందరూ తెలుసుకోవాలని సూచించారు. ఈ నెల 11న జాతీయ
స్విమ్మింగ్ పూల్ డే సందర్భంగా బుధవారం స్థానిక ఆక్వా స్పోర్ట్స్
కాంప్లెక్సులో వీరభద్ర స్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు. జల
క్రీడలకు ఉన్న ప్రాధాన్యత వివరించారు. పిల్లల్ని ప్రధానంగా
స్విమ్మింగ్‌పై ఆసక్తి ఉన్నవారిని తగిన విధంగా ప్రోత్సహించాలని,
తల్లిదండ్రులు వారికి అన్ని విధాలా సహకారం అందించాలని హితవు పలికారు.
ప్రభుత్వం తరఫున, తన వ్యక్తిగతంగా కూడా క్రీడలకు తగిన ప్రోత్సాహం
అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్
పరిధిలో ఇప్పటికే పలు స్విమ్మింగ్ పూల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని
డిప్యూటీ స్పీకర్ గుర్తు చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్
కాంప్లెక్సును, స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించి అందుబాటులోకి
తీసుకొచ్చామన్నారు. పిల్లల కోసం కంటోన్మెంట్ ప్రాంతంలో ఆధునిక వసతులతో
కూడిన పూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. నగరంలో ఉన్న
స్విమ్మింగ్ పూల్స్‌ను అందరూ అన్ని విధాలా ఉపయోగించుకోవాలని, వారి
మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. సోషల్ మీడియా
ప్రభావంతో చాలా మంది పిల్లలు క్రీడలకు దూరం అవుతున్నారని, ఇది మంచి
పరిణామం కాదని విచారం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని
క్రీడల వైపు మళ్లించి పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలని
సూచించారు. ఈ నెల 11న స్థానిక కంటోన్మెంట్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్సులోని
స్విమ్మింగ్ పూల్‌లో జల క్రీడల ప్రాధాన్యతను తెలుపుతూ వివిధ యోగా
జలాసనాలు వేయనున్నామని.. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని
డిప్యూటీ స్పీకర్ విజ్ఞప్తి చేశారు.
నమూనా జలాసనాలు వేసిన స్వామి : ఈ నెల 11న జాతీయ స్విమ్మింగ్ పూల్ డే
నేపథ్యంలో స్థానిక కంటోన్మెంట్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్సులో ఉన్న
స్విమ్మింగ్ పూల్‌లో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అర గంట
సేపు వివిధ నమూనా యోగా జలాసనాలు వేశారు. కాసేపు ఈత కొట్టిన ఆయన నీటిపై
తేలియాడుతూ మూడు రకాల ఆసనాలు వేశారు. అక్కడకు విచ్చేసిన ఆయన అభిమానులు,
స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు. స్థానిక కార్పొరేటర్లు, వైసీపీ
ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు.