భారతీయ మూలాలను మర్చిపోనని ప్రకటించుకున్న రిషి సునాక్
లండన్ : బ్రిటన్ రాజకీయాల్లో రిషి సునాక్ సరికొత్త చరిత్ర సృష్టించారు. భారత సంతతి వ్యక్తిగా తొలిసారి బ్రిటన్ పగ్గాలు చేపట్టనున్నారు. కన్జర్వేటివ్ నేతగా, బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన అనంతరం తొలిసారి రిషి సునాక్ మాట్లాడారు. స్థిరత్వం, ఐక్యతే తొలి ప్రాధాన్యమని చెప్పారు. లిజ్ ట్రస్ రాజీనామాతో ప్రధాని రేసులోకి దూసుకొచ్చిన రిషి కన్జర్వేటివ్ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఓవైపు టోరీ సభ్యులు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్న వేళ మరోవైపు బోరిస్ జాన్సన్, పెనీ మోర్డౌంట్ పోటీ నుంచి తప్పుకోవడంతో రిషి ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో త్వరలోనే రిషి సునాక్ ప్రధాని పగ్గాలు చేపట్టనున్నారు. బ్రిటిన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత రిషి సునాక్ తన తొలి ప్రసంగం చేశారు. బ్రిటన్ స్థిరత్వం, ఐక్యతే తన తొలి ప్రాధాన్యం అని పేర్కొన్నారు.
రిషి సునాక్ మాట్లాడుతూ ‘‘ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నకున్న మా పార్టీ ఎంపీలు, నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఎంతగానో ప్రేమించే ఈ పార్టీకి, దేశానికి సేవ చేసేందుకు నాజీవితంలో లభించిన అతిపెద్ద గౌరవం ఇది. యూకే గొప్ప దేశం. కానీ ప్రస్తుత తరుణంలో మన దేశం తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం మనకు స్థిరత్వం, ఐక్యత కావాలి. మన పార్టీని, దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి నేను అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. ప్రస్తుత సవాళ్లను అధిగమించడానికి, మన భవిష్యత్తు తరాలను గొప్పగా నిర్మించడానికి ఇదే ఏకైక మార్గం. ఎంతో చిత్తశుద్ధితో, అణుకువతో మీకు సేవ చేస్తానని హామీ ఇస్తున్నాను. బ్రిటీష్ ప్రజలకు అనునిత్యం సేవ చేస్తానని రిషి సునాక్ పేర్కొన్నారు.
భారతీయ మూలాలను మర్చిపోనని ప్రకటించుకున్న రిషి సునాక్ : బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన రిషి సునాక్.. ఎంత ఎత్తుకు ఎదిగినా భారతీయ మూలాలను మర్చిపోలేదు. బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడిగా భగవద్గీతపై ప్రమాణం చేసిన ఆయన.. హిందూ మూలాలను ఎప్పటికీ మర్చిపోనని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. తన అత్తమామలు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి – సుధామూర్తి సాధించిన ఘనతల పట్ల ఎంతో గర్వపడుతున్నానని గతంలో స్పష్టం చేశారు.